నంబర్‌ 20

darling prabhas 20 film john - Sakshi

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ట్వంటీ.. ట్వంటీ మ్యాచ్‌ల హడావిడి జోరుగా జరుగుతోంది. ప్లేయర్స్‌ అందరూ వారి వారి ఆటల్లో నిమగ్నమై ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా కొందరు తారలు కెరీర్‌లో ట్వంటీ ట్వంటీ వెండితెర మ్యాచ్‌లకు రెడీ అవుతున్నారు. అదేనండీ.. కెరీర్‌ పరంగా ‘20’ నంబర్‌ని టచ్‌ చేసిన స్టార్స్‌ కొందరు ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం.

అటు క్లాసు... ఇటు మాసు
‘సాహో’ మ్యాచ్‌ కోసం మాస్‌ యాక్షన్‌ ప్లే ఆడుతున్న ప్రభాస్, ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) మ్యాచ్‌ కోసం క్లాస్‌ ప్లేయర్‌గా మారిపోయారు. ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్‌ కెరీర్‌లో 20వ సినిమా. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 1970 నేపథ్యంలోని ప్రేమకథ ఇది. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేద్దాం అనుకున్నారు కానీ ప్రస్తుతం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట టీమ్‌. ఇక సుజిత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రద్ధా కపూర్‌ కథానాయిక.    

అదిరిపోయే స్ట్రాటజీ
మూడు సినిమాలను లైన్లో పెట్టి...ఫామ్‌ కోల్పోలేదు బాసూ.. సూపర్‌ ఇన్నింగ్‌ ఆడేందుకు మంచి స్ట్రాటజీ రెడీ చేస్తున్నానంటూ చెప్పకనే చెప్పారు స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌ అల్లు అర్జున్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించనున్న సినిమా శనివారం ఆరంభమైన విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు. ఇంతకుముందు అల్లు అర్జున్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ నెక్ట్స్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేయనున్నారు. ఇది అల్లుఅర్జున్‌ కెరీర్‌లో 20వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో రష్మికా మండన్నా హీరోగా నటించనున్నారు. షూటింగ్‌ ఈ ఏడాది సెకండాఫ్‌లో స్టార్ట్‌ కానుంది. ఇదే అల్లు అర్జున్‌ కెరీర్‌లో ట్వంటీ.. ట్వంటీ మ్యాచ్‌ అవుతుంది. ఆ నెక్ట్స్‌ ‘ఎంసీఏ’ ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌: కనపడుటలేదు’ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు అల్లు అర్జున్‌. ఇలా ఈ మధ్య కాస్త గ్యాప్‌ తీసుకున్న బన్నీ ఇప్పుడు బిజీ బిజీగా సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు.

కీర్తీ కా ఖేల్‌
‘మహానటి’ సినిమాతో అమాంతం స్టార్‌ లేడీ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో తన పేరును ఆడియన్స్‌ చేత రాయించుకున్నారు కీర్తీ సురేశ్‌. ప్రస్తుతం నరేంద్రనాథ్‌ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో నటిస్తున్నారు కీర్తీ సురేశ్‌. ఇది ఆమె కెరీర్‌లో ఆడుతున్న ట్వంటీ.. ట్వంటీ మ్యాచ్‌. అదేనండీ.. ఆమె కెరీర్‌లో 20వ సినిమా అని చెబుతున్నాం. ఇందులో రాజేంద్రప్రసాద్, సీనియర్‌ నరేశ్, నదియా, కమల్‌ కామరాజు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ టీమ్‌ త్వరలో ఫారిన్‌ షెడ్యూల్‌ కోసం ఫ్లైట్‌ ఎక్కనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఏడాదే కీర్తీ బాలీవుడ్‌ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్‌ ఆడటానికి రెడీ అవుతున్నారు. పుట్‌బాల్‌ కోచ్, మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందనున్న సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారు. ఇందులో సయ్యద్‌ పాత్రలో అజయ్‌ దేవగన్‌ నటిస్తారు.

ఒకప్పుటి స్టార్స్‌ కెరీర్‌ ఆరంభించిన రెండు మూడేళ్లకే 20 నంబర్‌ని టచ్‌ చేసేవారు. ఇప్పుడు ఆ నంబర్‌ చేరాలంటే ఏళ్లు పడుతోంది. ఒకప్పటిలా ‘సెంచరీ’ అనేది ఇప్పుడు కలగానే మిగిలిపోయే పరిస్థితి ఉంది. అయితే ‘హాఫ్‌ సెంచరీ’ కష్టం కాదు. 20 అడుగులేశారు. ఇంకో 30 అడుగులు వీజీగా వేసేస్తారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top