ఎఫ్‌టీఐఐ అధ్యక్షుడిగా బీపీ సింగ్‌

CID Director BP Singh As Appointed As FTII chairman - Sakshi

పాపులర్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘సీఐడీ’ దర్శక, నిర్మాత బీపీ సింగ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఈ ఉన్నారు. గత ఏడాది అక్టోబరులో అనుపమ్‌ ఖేర్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాది పాటు సేవలు అందించిన తర్వాత 2018 అక్టోబరు 31న అనుపమ్‌ ఖేర్‌ ఈ పదవి నుంచి బయటకొచ్చారు.

ఈ సందర్భంగా సింగ్‌కు ఎఫ్‌టీఐఐ పుణె డైరెక్టర్‌ భూపేంద్ర కైన్‌థోలా స్వాగతం పలికారు. ‘ఇన్‌స్టిట్యూట్‌లో జరిగే అన్ని విషయాలపై సింగ్‌కు అవగాహన ఉంది. మే 2017లో ఎఫ్‌టీఐఐ తరఫున దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫిల్మ్‌ ఎడ్యుకేషన్ ‘స్కిల్‌ ఇండియా ఇన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌’ ఆలోచన సింగ్‌దే. దీని ద్వారా దేశంలోని దాదాపు 24 నగరాల్లో 120 షార్ట్‌ కోర్సులను నిర్వహించాం’ అని ఆయన అన్నారు.

బీపీ సింగ్‌ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న ‘సీఐడీ’కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ సిరీస్‌ 21 ఏళ్లుగా బ్రేక్‌ లేకుండా సోనీ టీవీలో టెలికాస్ట్‌ అవుతోంది. 2004లో సింగ్‌ పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. ‘సీఐడీ’లోని 111 నిమిషాల షాట్‌ను సింగిల్‌ టేక్‌లో రికార్డు చేసిన ఘనత కూడా సింగ్‌కే దక్కింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top