గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు (ఇఫీ) ఘనంగా జరుగుతున్నాయి... సినీ ప్రతిభ, యువ దర్శకుల ఉత్సాహం, ప్రేరణాత్మక మాస్టర్‌క్లాస్‌లతో గోవా కళకళలాడుతోంది. ఫెస్టివల్‌లో అత్యంత ఆసక్తికరమైన విభాగమైన క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంఓటి) 48 గంటల ఛాలెంజ్ ముగింపుతో 4వ రోజు ఉద్వేగభరితంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు నిద్ర మర్చిపోయి పనిచేసిన యువ చిత్రకారులు తమ తుది చిత్రాలను ప్రదర్శించిన వేళ, వారి ముఖాల్లో అలసట, ఉపశమనం, సంతోషం కలగలిపి కనిపించాయి.
పి ఐ బి మీడియా సెంటర్ ఫెస్టివల్ ప్రధాన కేంద్రం గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దర్శకులు, నటీ నటులు తమ చిత్రాలపై ప్రేక్షకులతో, మీడియాతో ఆసక్తికరమైన చర్చలు జరిపారు.
డే తాల్ పాలో చిత్ర దర్శకులు ఇవాన్ డారియెల్ ఓర్టిజ్ లాండ్రోన్, జోస్ ఫెలిక్స్ గోమెజ్ తమ కథన నిర్మాణం గురించి వివరించారు.
న్యూజిలాండ్ చిత్రమైన పైక్ రివర్ భావోద్వేగ కథను ఎలా తెరపైకి తెచ్చారో రాబర్ట్ సార్కీస్ తెలిపారు.
ఆసియా చిత్రాలకు ప్రత్యేక స్థానం కల్పించిన సీసైడ్ సేరెండిపిటీ(టోమోమీ యోషిమురా), టైగర్ (అన్షుల్ చౌహాన్, కోసే కుడో, మినా మోటెకీ) బృందాలు తమ సృజనాత్మక అనుభవాలు పంచుకున్నాయి.
ప్రముఖ నేచర్ ఫిల్మ్ మేకర్ సందేశ్ కదూర్ (నీల్గిరీస్: ఏ షేర్డ్ వైల్డర్నెస్) మరాఠీ దర్శకుడు పర్ష్ మోకాషి (ముక్కమ్ పోస్ట్ బొంబిళ్వాది), అస్సాం దర్శకుడు దేబంగ్కర్ (బోర్గొహైన్ – సికార్) తమ సినిమాల ప్రత్యేకతలను, తాము తీసుకున్న సాహసోపేత కథల ఎంపికల నేపధ్యాలను వివరించారు.
కళా వైవిధ్యానికి ప్రతీకలైన అంతర్జాతీయ దర్శకులు క్రిస్టినా థెరిసా టౌర్నాట్జెస్ (కర్ల), హయాకావా చీ (రినోర్) ఒకే వేదికపై తమ కళా ప్రయాణం, సృజనాత్మక ప్రక్రియపై ప్రేక్షకులతో సంభాషించారు.
ప్రత్యేక ఆకర్షణగా అనుపమ్ ఖేర్ మాస్టర్‌క్లాస్
నాలుగో రోజు ప్రధాన హైలైట్‌గా నిలిచింది “గివింగ్ అప్ ఈజ్ నాట్ ఏ ఛాయిస్ ” మాస్టర్‌క్లాస్.
కళా అకాడమీ వేదికగా నటుడు, ప్రసంగకుడు అనుపమ్ ఖేర్ ఇచ్చిన ప్రేరణాత్మక ఉపన్యాసం ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. సినీ ప్రయాణాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, ఓటముల్ని ఎలా జయించాలి, సృజనాత్మకతకు పట్టుదల ఎందుకు అవసరం వంటి అంశాలపై ఆయన ప్రసంగం అందరికీ ఉత్తేజాన్నిచ్చింది.
సీఎంఓటి 48 గంటల ఛాలెంజ్ ముగింపు
ఇఫిలో 48 గంటల క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంఓటి) ఛాలెంజ్ ముగింపు వేడుక కళా అకాడమీలో జరిగింది. కొద్ది గంటల్లోనే కథలు, స్క్రిప్ట్‌లు, షూటింగ్, ఎడిటింగ్ పూర్తి చేసిన యువ దర్శకుల ప్రతిభను జ్యూరీ ప్రశంసించింది. ఫెస్టివల్‌లో ఈ విభాగం యువతకు తెరపైకి వచ్చే అవకాశం కల్పించే ప్రధాన వేదికగా కొనసాగుతోంది. 5వరోజైన సోమవారం దీని ఫలితాలు వెల్లడి కానున్నాయి.


