విజయనిర్మల మృతికి చిరు, బాలయ్య సంతాపం

Chiranjeevi, Balakrishna Tribute to Vijaya Nirmala - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నటి, దర్శక నిర్మాత విజయనిర్మల మరణంపై తెలుగు సినిమా పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతికి సినీ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అరుదైన ద‌ర్శ‌క న‌టీమ‌ణి విజ‌యనిర్మ‌ల హ‌ఠాన్మ‌ర‌ణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విజ‌య‌నిర్మ‌ల‌ క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రమని నంద‌మూరి బాల‌కృష్ణ‌ పేర్కొన్నారు.

‘తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి విజ‌య‌నిర్మ‌ల. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు. అంత‌టి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. కృష్ణ‌ జీవిత భాగ‌స్వామిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు. ఆమె లేని లోటు కృష్ణ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తూ కృష్ణ‌, న‌రేస్‌లకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను’ అని సంతాప సందేశంలో చిరంజీవి పేర్కొన్నారు.

‘సినీ రంగ పరిశ్ర‌మ‌లో మ‌హిళా సాధికార‌త‌ను చాటిన అతి కొద్ది మంది మ‌హిళ‌ల్లో విజ‌య‌నిర్మ‌ల‌ ఒక‌రు. నాన్న‌గారి `పాండురంగ మ‌హ‌త్యం` సినిమాలో కృష్ణుడిగా న‌టించారు. అదే ఆవిడ న‌టించిన తొలి తెలుగు సినిమా. బాలన‌టి నుంచి హీరోయిన్‌గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో న‌టించారు. నాన్న‌గారితో మారిన మ‌నిషి, పెత్తందార్లు, నిండుదంప‌తులు, విచిత్ర‌ కుటుంబం సినిమాల్లో న‌టించారు. అలాగే ద‌ర్శ‌కురాలిగా 44 చిత్రాల‌ను డైరెక్ట్ చేయ‌డం చాలా గొప్ప విష‌యం. ద‌ర్శ‌కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్ర‌సీమ‌కు తీర‌నిలోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని నంద‌మూరి బాల‌కృష్ణ‌ పేర్కొన్నారు.             

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top