టాలీవుడ్ దర్శకుల్లో చాలామందికి చిరంజీవితో సినిమా చేయాలని ఆశ. కానీ ఎప్పటికప్పుడు చిరంజీవి మూవీస్ లైనప్ మారిపోతూనే ఉంది. ప్రస్తుతానికైతే యంగ్ డైరెక్టర్స్‌కే ఎక్కువగా అవకాశమిస్తున్నారు. సంక్రాంతికి అనిల్ రావిపూడితో వచ్చి హిట్ కొట్టారు. 'విశ్వంభర' కోసం వశిష్ఠతో పనిచేశారు. ప్రస్తుతం బాబీతో, శ్రీకాంత్ ఓదెలతో తలో ప్రాజెక్ట్ చేయనున్నారు. తర్వాత ఎవరితో చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు హరీశ్ శంకర్.. చిరుతో మూవీ చేయాలని ఆశపడుతున్నాడు.
(ఇదీ చదవండి: రిలీజ్‌కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!)
పవన్‌తో కలిసి గతంలో 'గబ్బర్ సింగ్' చేసి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న హరీశ్ శంకర్.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' చేశాడు. ఈ గురువారమే సినిమా థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగానే చిరంజీవితో మూవీ చేయడం గురించి హరీశ్ శంకర్ మాట్లాడాడు. రౌడీ అల్లుడు, దొంగ మొగడు లాంటి ఎంటర్‌టైనర్ తీయాలని ఉందంటూ తన ఆశని బయటపెట్టాడు.
'ఈ (ఉస్తాద్ భగత్ సింగ్) ట్రైలర్ చూసి చిరంజీవి నాతో 20 నిమిషాలు మాట్లాడారు. డైలాగ్స్ బాగున్నాయని మెచ్చుకున్నారు. పవన్ అందంగా ఉన్నారని చెప్పారు. ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత నాకో విషయం అర్థమైంది. చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు కొడుకు కూడా అనిపించింది. నేను చిరంజీవిని చాలాసార్లు కలిశాను. కలిసి కొన్ని యాడ్స్ కూడా తీశాను. ఆయనతో నా మూవీ ప్రాసెస్‌లో ఉంది. కచ్చితంగా మెగాస్టార్‌తో గ్యాంగ్ లీడర్, దొంగ మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమా చేసి తీరతాను' అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు.
హరీశ్ శంకర్ చెప్పడం వరకు బాగానే ఉంది గానీ చిరంజీవి యస్ చెబతారా అనేది ప్రశ్న. ఎందుకంటే హరీశ్ శంకర్ దర్శకుడిగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ లేవు. అప్పుడెప్పుడో వచ్చిన గబ్బర్ సింగ్ మాత్రమే పెద్ద హిట్. తర్వాత చేసిన వాటిలో ఒకటి రెండు హిట్స్ ఉన్నప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర ఓకే ఓకే అనిపించాయి. గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. 'ఉస్తాద్' సంగతేంటనేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. ఇది హిట్ అయి, హరీశ్ శంకర్ ఆశ నిజమవుతుందో లేదో చూడాలి? ఎందుకంటే గతంలోనే చిరు-హరీశ్ మూవీ అంటూ రూమర్స్ వచ్చాయి.
(ఇదీ చదవండి: త్వరలోనే విజయ్‌తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!)


