ఏపీ దిశా చట్టం అభినందనీయం | Chiranjeevi Appreciates Andhra Pradesh Disha Act 2019 | Sakshi
Sakshi News home page

ఏపీ దిశా చట్టం అభినందనీయం

Dec 13 2019 1:02 AM | Updated on Dec 13 2019 6:16 PM

Chiranjeevi Appreciates Andhra Pradesh Disha Act 2019 - Sakshi

దిశ హత్యాచారం నేపథ్యంలో మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ క్రిమినల్‌ లా చట్ట సవరణ బిల్లు–2019కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని ప్రముఖ నటుడు చిరంజీవి అభినందించారు. ‘‘దిశా’ చట్టం–2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా,  భద్రత ఇస్తుందన్న ఆశ నాలో ఉంది. ‘దిశ’ ఘటన మనందర్నీ కలచివేసింది. ఆ భావోద్వేగాలు తక్షణ న్యాయాన్ని డిమాండ్‌ చేశాయి.

తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాలను ఇస్తుందన్న నమ్మకం అందరిలో ఉంది. అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్‌లో తొలి అడుగు పడటం హర్షణీయం. సీఆర్పీసీ (కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసిజర్‌)ని సవరించడం ద్వారా నాలుగు నెలలు అంతకంటే ఎక్కవ పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించే వీలు ఉంది. సోషల్‌ మీడియాలో మహిళల గౌరవాన్ని కించపరచడంలాంటివి చేస్తే ఐపీసీ (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌) ద్వారా తీవ్రమైన శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్నవాళ్లలో భయం కల్పించే విధంగా చట్టం తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రత్యేక కోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించడం వల్ల మహిళాలోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం నాకు ఉంది’’ అని ఓ ప్రకటనలో చిరంజీవి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement