నట్టికుమార్ ఆరోపణలు నిరాధారమైనవి

నట్టికుమార్ ఆరోపణలు నిరాధారమైనవి - Sakshi


నయీమ్‌తో పలువురు నిర్మాతలకు సత్సంబంధాలున్నాయంటూ నిర్మాత నట్టికుమార్ చేసిన ఆరోపణలను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. కేవలం ప్రచారం కోసమే నట్టికుమార్ నిరాధారమైన ఆరోపణలు చేశారని నిర్మాతల మండలి సభ్యులు పేర్కొన్నారు. నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్ కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ, నటుడు-నిర్మాత సచిన్ జోషిలకు నయీమ్‌తో సంబంధాలున్నాయని సోమవారం నట్టికుమార్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

 

 ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామ కృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ‘‘నయీమ్‌తో నిర్మాతలెవరికీ సంబంధాలు లేవు. ఉన్నాయని కూడా అనుకోవడం లేదు. నట్టికుమార్ ఆరోపణల వలన ప్రేక్షకుల్లో నిర్మాతలపై చులకన భావం ఏర్పడుతుంది. ఆరోపణలకు వివరణ కోరుతూ నట్టికుమార్‌కి నోటీసులు జారీ చేశాం.

 

  సమాధానం ఇవ్వని పక్షంలో వారంలో రోజుల్లో మళ్లీ సమావేశమై ఓ  నిర్ణయం తీసుకుంటాం. వీలైనంత త్వరలో యాక్షన్ తీసుకుంటాం’’ అని నిర్మాతల మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా కోర్టు కేసుల చుట్టూ నట్టికుమార్ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. నట్టికుమార్‌పై వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేస్తున్నట్టు బూరుగుపల్లి శివరామకృష్ణ, అశోక్ కుమార్ తెలిపారు.

 

 నిర్మాతల మండలిలో రూ.14కోట్లు గోల్‌మాల్ జరిగిందంటూ ప్రసన్నకుమార్ చేసిన ఆరోపణలకూ వివరణ ఇచ్చారు. గతంలో సెక్రటరీగా పనిచేసిన నిర్మాత శేఖర్‌బాబు, క్యాషియర్ జానకిరామ్‌లు తప్పుడు లెక్కలు చూపించి రూ.59.30 లక్షలు మాయం చేశారని స్పష్టం చేశారు. వీరిద్దరిపై పోలీస్ కేసు పెట్టడం జరిగిందన్నారు. నిర్మాతలు కొడాలి వెంకటేశ్వర రావు, దామోదర ప్రసాద్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బెల్లంకొండ సురేశ్, ఎమ్మెల్ కుమార్ చౌదరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top