
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరలు రెండు రాష్ట్రాల్లో భారీగా పెంచేశారు. ఏపీలో అయితే ఏకంగా ప్రీమియర్ షో ధర 1000 చేయడంతో సామాన్యులతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా వ్యతిరేఖత వస్తుంది. ఒక సినిమా టికెట్ ధర ఈ రేంజ్‌లో పెంచడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ కూడా ఇంత ధర లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఓజీ ధరలపై స్పందించారు.
ఓజీ సినిమా టికెట్ రేట్లు ఇంతలా పెంచడం చాలా తప్పని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ఈ విషయంలో చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్యతో పాటు ఫిలిం ఛాంబర్, కౌన్సిల్ వారు బాధ్యత వహించాలన్నారు. ఎవరైతే ఈ టికెట్ ధరల పెంపు వెనుక ఉన్నారో వారందరూ ఈ తప్పులో భాగమని పేర్కొన్నారు. ఓజీ టికెట్ ధరల పెంపు విషయంలో ఈ ప్రభుత్వాలు కళ్లు మూసుకొని అనుమతులు ఇచ్చేస్తున్నాయన్నారు. పేదవాడికి పెన్షన్ ఇస్తున్నామని కుడి చేత్తో ఇచ్చి ఇలా ఎడమచేత్తో లాగేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలా ఇష్టం వచ్చినట్లు సినిమా టికెట్ రేట్లు పెంచితే పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని గుర్తుచేశారు. ఇలాగే కొనసాగితే ప్రేక్షకులు ఓటీటీ, పైరసీలకు అలవాటు పడుతారన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
టికెట్ ధరల విషయంలో జగనే కరెక్ట్
'సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయమే కరెక్ట్.. ఇండస్ట్రీ మీద ఆయన తీసుకున్న నిర్ణయాలు బాగానే ఉండేవి. సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే రూ. 50, రూ. 150 కోట్లు దాటితే రూ. 100 పెంచుకునేందుకు గతంలో జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి ఒక్కో టికెట్ మీద రూ. 100 పెంచారు. జీఎస్‌టీకి సంబంధించి ఎంత ఖర్చు అయిందో చూపితే అంత మొత్తాన్ని తిరిగిచెల్లిస్తామన్నారు. దీంతో చిన్న, పెద్ద చిత్రాలకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో చాలా బాగా పనిచేసింది.
ఈ విషయంలో చిరంజీవి చోరవ చూపించగా జగన్ జీవో రూపంలో సడలింపులు ఇచ్చి ఇండస్ట్రీకి మేలు చేశారు. ప్రస్తుతం ఎలాంటి విచారణ లేకుండానే టికెట్ ధరలు పెంచేస్తున్నారు. జగన్ నిర్ణయాలు కొందరికి నచ్చకపోయినప్పటికీ ఇండస్ట్రీకి అనుకూలంగానే ఉండేవి.' అని ఆయన గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్లు సినిమా టికెట్ ధరలను పెంచేసి ప్రేక్షకులను థియేటర్‌కు రాకుండా చేస్తున్నారని నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఒక్కసారి కర్ణాటక, తమిళనాడులో సినిమా టికెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన కోరారు.
రైతులకు న్యాయం చేయరు
సినిమా టికెట్ ధరలు పెంచిన ఈ ప్రభుత్వ పెద్దలు రైతులకు అండగా నిలబడరని నట్టి కుమార్ ఇలా అన్నారు. 'రైతులు కూడా పెట్టుబడిదారులు.. పేదవాళ్లు.. వాళ్లకు సాయం చేస్తే గొప్పవాళ్లు అయిపోతారు. అందుకే వీళ్లు రైతులకు మద్ధతు ధరలు ప్రకటించరు. కానీ, ఇలా సినిమా టికెట్ ధరలు పెంచి నిర్మాత దానయ్య, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజులకు మాత్రం మేలు చేస్తున్నారు.. కానీ, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా సరే సాయం చేయరు. కనీసం యూరియా కూడా వారికి దొరకడం లేదు. ఒక సినిమాకు మద్ధతు ధర ఇచ్చిన ఈ ప్రభుత్వం.. టమాటో, ఉల్లితో నష్టపోయిన రైతులకు మద్ధతు ధర ఎందుకు ఇవ్వరు. కనీసం సినిమాకు ఇచ్చిన ప్రయారిటీ రైతుకు ఇవ్వకుంటే ఎలా.. వాళ్లు ఆత్మహత్య చేసుకోవాలా..? నేడు రైతులు ఆవేశంతో ఉన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించాలి.'