ఈసారి తెర మీద కృష్ణుడిగా రాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ | Hrithik Roshan is going to play Krishna role in the "Mahabharatam" - Sakshi
Sakshi News home page

కృష్ణావతారం ఎత్తనున్న హృతిక్‌?

Published Tue, Dec 24 2019 12:31 PM

Bollywood Star Hero Hrithik Will Play Krishna In Deepikas Mahabharata - Sakshi

అన్నీ కుదిరితే  బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కృష్ణావతారం ఎత్తనున్నారు. ఇప్పటివరకు క్రిష్‌గా అభిమానులను అలరించిన హృతిక్‌ ఈసారి కృష్ణుడిగా అందరి మనసులను దొంగలించే అవకాశం ఉంది. మధు మంతెన నిర్మాణ భాగస్వామ్యంలో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న చిత్రం ‘మహాభారతం’.. అయితే భారీ కాస్టింగ్‌తో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు మధు మంతెన. దీనిలో భాగంగా ద్రౌపది పాత్రను దీపికా పడుకోన్‌ పోషించనున్నారు. అయితే మహాభారతంలో అతిముఖ్యమైన కృష్ణుడి పాత్ర కోసం పలువురు బాలీవుడ్‌ ఆగ్రహీరోలతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు.

దీనిలో భాగంగా హృతిక్‌ రోషన్‌తో ఫిల్మ్‌ మేకర్‌ మధు మంతెన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కృష్ణుడి లాంటి చాలెంజింగ్‌ పాత్రలో నటించేందకు హృతిక్‌ అంగీకరించినట్లు బాలీవుడ్‌ టౌన్‌లో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే గతంలో కృష్ణుడి పాత్రను అక్షయ్‌ కుమార్‌ లేక అమీర్‌ ఖాన్‌లు పోషించే అవకాశం ఉందని అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హృతిక్‌ పేరు తెరపైకి రావడంతో కృష్ణుడు ఎవరనే దానిపై సస్పెన్స్‌ ఇంకా వీడలేదు. (చదవండి: ఆయనతో లిప్‌లాక్‌ అంటే ఓకే!)

ఇక ద్రౌపది పాత్ర దీపిక పోషించనుండటంపై ఫిల్మ్‌మేకర్‌ మధు ఆనందం వ్యక్తం చేశారు. ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలు చూశాక రాణి పాత్ర అంటే దీపికనే చేయాలనే భావన కలిగిందన్నారు. అంతేకాకుండా ఈ రెండు సినిమాల్లో దీపిక రాణి పాత్రలో జీవించేశారని, అప్పటికాలంలో రాణులంటే ఇలాగే ఉండేవారేమో అనిపించేంతగా ఆ పాత్రలను పోషించారని ప్రశంసల వర్షం కురిపించారు.  ద్రౌపది పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ సినిమా రూపొందడం విలక్షణమని చెప్పారు.

దీపికా చిత్ర బృందంలో చేరడంతోనే ఈ మూవీని భారీస్ధాయిలో రూపొందుతోందని.. ఆమె భారత్‌లో అతిపెద్ద నటి మాత్రమే కాకుండా సినిమాకు హద్దులు చెరిపివేసే సామర్థ్యం దీపికాకు ఉందని అన్నారు. తెలుగు, హిందీ సహా భిన్న భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ పలు భాగాలుగా రూపొందనుంది. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి దీపిక సహ నిర్మాత వ్యవహరించనున్న విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement