బిగ్‌బాస్‌: ఆ సెంటిమెంటే శ్రీముఖిని ఓడించిందా?

Bigg Boss 3 Telugu: Tatto May Reason For Sreemukhi Failure - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు 3 విజేతగా పాతబస్తీ పోరడు రాహుల్‌ సిప్లిగంజ్‌ నిలిచాడు. మొదటి నుంచి టైటిల్‌ ఫేవరెట్‌గా ఉన్న శ్రీముఖి చివరి నిమిషంలో తడబడి రెండో స్థానానికి పరిమితమైంది. రాహుల్‌ నిజాయితీ, ముక్కుసూటితనం, నిరాడంబరత అన్నీ ప్రేక్షకులు జై కొట్టేలా చేశాయి. ఇక మొదటి నుంచి టాస్క్‌ల్లో, ఎంటర్‌టైన్‌మెంట్‌లో శ్రీముఖి దూకుడు ప్రదర్శించినప్పటికీ ఆమె ఓటమిని ముందే పసిగట్టామని కొందరు కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖి వేసుకున్న పచ్చబొట్టే  ఆమె ఓటమికి నాంది పలికిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

పచ్చబొట్టు సెంటిమెంట్‌ కథేంటి?
బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌ గీతా మాధురి పచ్చబొట్టు వేయించుకుంది. చిచ్చుబుడ్డిలా ఇంట్లో సందడి చేసే గీతామాధురే టైటిల్‌ విజేతగా నిలుస్తుందని చాలామంది ధీమా వ్యక్తం చేశారు. విజయపుటంచులదాకా వచ్చిన గీత.. కౌశల్‌ ఆర్మీ దెబ్బతో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక హౌస్‌లోని కంటెస్టెంట్‌ బాబు గోగినేనిని ఎలిమినేషన్‌ నుంచి తప్పించడానికి గీతామాధురి టాటూ వేసుకోవాల్సి వచ్చింది. అతన్ని కేవలం ఒక్కవారం ఎలిమినేషన్‌ నుంచి తప్పించడానికి మాత్రమే ఆ పచ్చబొట్టు ఉపయోగపడుతుంది. దీనికోసం శరీరంపై జీవితాంతం గుర్తుండిపోయేలా టాటూ వేసుకోడానికి గీత సిద్ధపడుతుందా? అని అందరూ అనుమానపడ్డారు. కానీ గీతామాధురి వెంటనే ఒప్పేసుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సీజన్‌లో శ్రీముఖికి కూడా బిగ్‌బాస్‌ అలాంటి టాస్కే ఇచ్చాడు.


సేమ్‌ టు సేమ్‌..
వరుణ్‌ను నామినేషన్‌ నుంచి ఒకవారంపాటు సేవ్‌ చేయడానికి టాటూ వేసుకుంటావో, లేదో నిర్ణయాన్ని చెప్పాల్సిందిగా బిగ్‌బాస్‌ శ్రీముఖిని ఆదేశించాడు. అయితే శ్రీముఖి.. తనకు కాబోయే భర్త పేరు మాత్రమే టాటూ వేయించుకోవాలనుకున్నాను అని చెబుతూనే.. ఇష్టం లేకపోయినా వరుణ్‌ కోసం పచ్చబొట్టు వేయించుకుంది. అయితే గత సీజన్‌లో గీతా మాధురి పచ్చబొట్టు వేయించుకోవడం.. రన్నరప్‌గా నిలివటాన్ని ప్రస్తుత సీజన్‌తో పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. సేమ్‌ టు సేమ్‌.. ఈ సీజన్‌లోనూ శ్రీముఖి పచ్చబొట్టు వేయించుకుందని.. అందువల్లే ఆమె ఓటమిపాలైందని కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఎంతో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనుకున్న శ్రీముఖి టైటిల్‌ పోరులో వెనకబడటానికి పచ్చబొట్టే కారణమని చెప్తున్నారు. పచ్చబొట్టు శ్రీముఖి కొంపముంచిందంటూ సానుభూతి ప్రకటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top