బాహుబ‌లితో ఆ ఐదింటిపై ప్ర‌భాస్ ప‌ట్టు | Bahubali Turns Prabhas Into A Global Star: He Achieved Rare Feats | Sakshi
Sakshi News home page

ప్ర‌భాస్ సాధించిన ఐదు అంశాలు

Jul 10 2020 11:25 AM | Updated on Jul 10 2020 1:12 PM

Bahubali Turns Prabhas Into A Global Star: He Achieved Rare Feats - Sakshi

రెబ‌ల్ స్టార్‌‌ ప్ర‌భాస్ సినీ ప్ర‌యాణాన్ని చెప్పుకోవాలంటే బాహుబ‌లికి ముందు, బాహుబ‌లికి త‌ర్వాత అని చెప్పాల్సిందే. అప్ప‌టివ‌ర‌కూ కొంద‌రివాడైన ప్ర‌భాస్ "బాహుబ‌లి: ది బిగినింగ్‌"తో చిత్రంతో అంద‌రివాడిగా మారిపోయాడు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా హిట్ కొట్టిన ఈ సినిమా అంద‌రిక‌న్నా ప్ర‌భాస్‌కే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత ఆయ‌న కెరీర్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ కింది ఐదు అంశాలు డార్లింగ్ హీరోకు బాగా కలిసొచ్చాయి. బాహుబ‌లి మొద‌టి భాగం విడుద‌లై ఐదు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం.. (బాహుబలికి ముందు ఆ సినిమానే!)

స‌రిహ‌ద్దులు దాటిన ఫాలోయింగ్‌: బాహుబ‌లి మొద‌టి పార్ట్‌తో ప్ర‌భాస్ పాన్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా మారిపోయాడు. అత‌ని ఫాలోయింగ్ ఖండాంత‌రాలను దాటింది. జ‌పాన్‌, ర‌ష్యాలోనూ ప్ర‌భాస్‌కు పుట్టెడు అభిమానులు పుట్టుకొచ్చారు. అత‌ను త‌ర్వాత న‌టించిన 'సాహో' తెలుగు బాక్సాఫీస్ క‌న్నా హిందీలోనే అధికంగా వ‌సూళ్లు కురిపించ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం. 

మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ప్ర‌భాస్ విగ్ర‌హం: ఈ మ్యూజియంలో త‌న మైన‌పు విగ్ర‌హం ఉండాల‌ని ఎంతోమంది న‌టీన‌టుల క‌ల‌. అలాంటి గొప్ప అవ‌కాశం ప్ర‌భాస్ చెంత‌న చేరింది. బ్యాంకాక్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్‌లో మైన‌పు విగ్ర‌హం ఏర్ప‌డిన‌ తొలి ద‌క్షిణాది న‌టుడిగా అత‌ని‌ పేరిట రికార్డు న‌మోదైంది. (‘బాహుబలి’ ఖాతాలో మరో అవార్డు)

రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్: ల‌ండ‌న్‌లోని ప్ర‌ఖ్యాత రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్‌లో గ‌తేడాది అక్టోబ‌ర్ 19వ తేదీన 'బాహుబ‌లి: ది బిగినింగ్' చిత్రాన్ని స్క్రీనింగ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి హీరోతోపాటు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ‌, అనుష్క, రానా హాజ‌ర‌య్యారు. అక్కడి మీడియా కూడా మ‌న హీరోను కెమెరాల్లో బంధించేందుకు తెగ ఆస‌క్తి చూపింది. అతన్ని చూసేందుకు జ‌పాన్ వంటి దేశాల‌నుంచి సైతం అభిమానులు లండ‌న్ చేరుకోవ‌డం విశేషం.

ర‌ష్యాలో ప్ర‌భాస్ ప్ర‌భంజ‌నం: ర‌ష్యాలోనూ బాహుబ‌లి1,2 రిలీజయ్యాయి. కాక‌పోతే ఇవి అక్క‌డి టీవీ చానెల్‌లో ప్లే అయ్యాయి. ఈ సినిమాలు అక్క‌డ విశేష పాపులారిటీ దక్కించుకున్నాయి. ఇందులో అమ‌రేంద్ర బాహుబ‌లిగా అద్వితీయంగా న‌టించిన ప్ర‌భాస్ "ర‌ష్యా ఆడియ‌న్స్ హార్ట్" అవార్డును ఎగ‌రేసుకుపోయాడు. బాలీవుడ్ హీరో రాజ్ క‌పూర్ త‌ర్వాత ఈ అవార్డును అందుకున్న రెండో భార‌తీయ న‌టుడిగా ప్ర‌భాస్ నిలిచాడు. ముప్పై ఏళ్ల క్రితం.. శ్రీ 420, ఆవారా, ఆరాధ‌న వంటి చిత్రాల‌తో రాజ్ క‌పూర్ ఈ అవార్డుకు ఎంపిక‌య్యాడు. (‘అమరేంద్ర బాహుబలి అనే వార్నర్‌’)


హిందీలో మార్కెట్ ఉన్న ద‌క్షిణాది హీరో: బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు ద‌క్షిణాదిన పాపులారిటీ, ఫాలోయింగ్ స‌ర్వ‌సాధార‌ణం. కానీ ద‌క్షిణాది సెల‌బ్రిటీల‌కు మాత్రం బాలీవుడ్‌లో పెద్ద‌గా ఆద‌ర‌ణ లేదు. ఏళ్ల త‌ర‌బ‌డి వ‌స్తున్న‌ ఈ నియ‌మాన్ని ప్ర‌భాస్ చెరిపేశాడు. హిందీలోనూ త‌న‌కంటూ మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటూ త‌న పాపులారిటీని పెంచుకుంటూ పోతున్నాడు. దీనికి హిందీలో రిలీజైన సాహో రికార్డులే సాక్ష్యం. వ‌సూళ్ల ప‌రంగా తెలుగు, త‌మిళంలో క‌న్నా హిందీ వ‌ర్ష‌న్‌లో సాహో 150 కోట్ల రూపా‌య‌ల‌ను కొల్ల‌గొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement