ప్రీతి ఎక్కడ అర్జున్‌?!

Arjun Reddy is remake in Kollywood And Bollywood - Sakshi

అర్జున్‌రెడ్డి తెలుగులో దుమ్ము రేపింది.ఆ దుమ్ము కోలీవుడ్‌లో, బాలీవుడ్‌లో దుమారం రేపింది.రీమేక్‌ చేస్తున్నారు. అయితే అదంత ఈజీ కావడం లేదు!పెద్ద హిట్‌ సినిమాను రీమేక్‌ చేయడానికి ఉండే తంటాలే ఇవి. ఇప్పటికింకా..అర్జున్‌రెడ్డి రీమేకింగ్‌లోనే ఉన్నాడు. హీరోయిన్‌లు ఫైనల్‌ అయినా..ఫైనల్‌ వరకు వాళ్లు ప్రీతిలా చేయగలరా?రీమేక్‌ అర్జున్‌రెడ్డికి ఒర్జినల్‌ ప్రీతి కనిపిస్తుందా?

తెలుగు ‘అర్జున్‌రెడ్డి’లో లవర్‌ గర్ల్‌ పాత్ర కోసం షాలినీ పాండేకు (సినిమాలో ప్రీతి) ముందు డైరెక్టర్‌ ఎంతమందిని వడపోశారో తెలీదు. తమిళ్‌ అర్జున్‌రెడ్డికి మాత్రం మొదట మేఘా చౌదరిని అనుకున్నారు. ఆమెతో పూర్తి సినిమా తీశారు. ఆ షూట్‌ని పక్కన పడేసి జాహ్నవిని అనుకున్నారు. అది వర్కవుట్‌ కాలేదు. బనితా సందూని తీసుకున్నారు. ఆమెతో ఫ్రెష్‌గా షూటింగ్‌ మొదలు పెట్టారు. హిందీ అర్జున్‌రెడ్డికి కూడా మొదట తీసుకోవాలనుకున్నది అనన్య పాండేను. తర్వాత తీసుకున్నది కియారా అద్వానీని. ఎందుకిలా హీరోయిన్‌లను మార్చేస్తున్నారు. ప్రీతిలా కనిపిస్తారో లేదోనన్న సందేహమా? మరేమైనా కారణాలా?!

ఫిబ్రవరి 15న రిలీజ్‌ కావాలి ‘వర్మా’. కాలేదు.‘అర్జున్‌రెడ్డి’ తమిళ్‌ వెర్షనే ‘వర్మా’. ధ్రువ్‌ హీరో. విక్రమ్‌ కొడుకు. ఎందుకు విడుదల కాలేదు?ఫస్ట్‌ కాపీ వచ్చింది. ధ్రువ్‌ హీరోలా ఉన్నాడు. విక్రమ్‌లా ఉన్నాడు. కానీ అర్జున్‌రెడ్డిలా లేడు!అర్జున్‌రెడ్డిలా ఉండడం అంటే విజయ్‌ దేవరకొండలా ఉండడం. అది ఆశించారు నిర్మాతలు. అలా ఉండదేమో అని కూడా అనుమానించారు. మామూలుగా తీశాడా, మామూలుగా చూపించాడా అర్జున్‌రెడ్డిని, దేవరకొండని.. మన డైరెక్టర్‌ సందీప్‌ వంగ! పిక్చర్‌ పదహారు జూన్‌లో మొదలై, పదిహేడు జూన్‌లో ఫినిష్‌ అయింది. ఆ వెంటనే ఆగస్టులో విడుదలైంది. బడ్జెట్‌ నాలుగు కోట్లు. బాక్సాఫీస్‌ ఇచ్చింది యాభై కోట్లు! డబ్బు అలా ఉంచండి. ఎంత రొద! రణగొణధ్వని.‘వర్మా’ను పద్దెనిమిది మార్చిలో మొదలు పెట్టి ఏడు నెలల్లో ఫినిష్‌ చేశాడు డైరెక్టర్‌ బాలా. ఫస్ట్‌ కాపీ చూసి, ‘‘రిలీజ్‌ చెయ్యడం లేదు. మళ్లీ మొత్తం షూట్‌ చేస్తున్నాం’’ అని ‘ఇ4’ (నిర్మాణ సంస్థ) రిలీజ్‌కు ముందు ప్రకటన ఇచ్చింది! కొత్త వెర్షన్‌ రిలీజ్‌ టైమ్‌ కూడా ఇచ్చేసింది. ఈ ఇయర్‌ జూన్‌లో ఏదో ఒక ఫ్రైడే. ఈసారి డైరెక్టర్‌ బాలా మాత్రం కాదు.

వేరెవరైనా! రెండు రోజుల క్రితం ఆ వేరెవరైనా అనే వ్యక్తి దొరికాడు. గిరీశ్‌ అయా. తెలుగు అర్జున్‌రెడ్డి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అతడు!ఇ4 బాలాకు ముందే చెప్పింది. ‘వర్మా’.. సేమ్‌ ఒరిజినల్‌లా ఉండాలని. అంటే తెలుగు ‘అర్జున్‌రెడ్డి’లా. కానీ తమిళ్‌కి ఒక ఒరిజినల్‌ ఉంటుందిగా. ఆ ఒరిజినాలిటీని పట్టుకున్నట్టున్నాడు బాలా. ఇ4కి అది నచ్చలేదు.  వద్దనుకుంది. రద్దు ప్రకటన రిలీజ్‌  చేసింది. తర్వాత బాలా కూడా ఒక నోట్‌ రిలీజ్‌ చేశాడు. తను చెప్పడం.. ఏవో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ అని. డబ్బులిచ్చి తీయించేవాడు నిర్మాత, డబ్బులు తీసుకుని నిర్మించేవాడు దర్శకుడు. ‘వర్మా’లో కొన్ని సీన్‌లప్పుడు ఇద్దరి మధ్య డబ్బుకు బదులు ‘ఇగో’ ముఖ్యపాత్ర పోషించింది. ఫిల్మ్‌ ముక్కలయింది. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాల్సింది. సింగిల్‌ కాపీ ఉన్న బాక్సే బద్దలైపోయింది!∙∙ బాలా.. సందీప్‌ కన్నా సీనియర్‌. ట్వంటీ ఇయర్స్‌ ఇండస్త్రీ. లాంగ్‌ కెరియర్‌. ‘శివపుత్రుడు, వాడు–వీడు, నేనే దేవుడు’.. మంచి మంచి హిట్స్‌. çసందీప్‌కి ‘అర్జున్‌రెడ్డి’ తొలి చిత్రం. రెండో సినిమా ఇంకా రాలేదు. అర్జున్‌రెడ్డినే హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా తీస్తున్నాడు సందీప్‌.

ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. పిక్చర్‌ పూర్తయితే జూన్‌ 21న విడుదల. ‘వర్మా’ను తియ్యడానికి నిజానికి బాలా అంత సీనియర్‌ అవసరం లేదు. అర్జున్‌రెడ్డిలా ఉండాలి అనుకున్నప్పుడు ఇ4 సంస్థ సందీప్‌నే డైరెక్టర్‌గా తీసుకుని ఉండాలి. మన దగ్గరే ‘సీనియర్‌ సందీప్‌’ ఉన్నప్పుడు చెన్నై నుంచి హైద్రాబాద్‌ వెళ్లడం ఎందుకనుకున్నారు నిర్మాతలు. ఇంకోటి కూడా పని చేసింది. విక్రమ్‌కి ‘సేతు’తో బ్రేక్‌ ఇచ్చిన బాలా.. విక్రమ్‌ కొడుకు ధ్రువ్‌కీ ‘వర్మా’తో అలాంటి బ్రేకే ఇవ్వొచ్చని ఒక సెంటిమెంట్‌. అయితే సినిమా తీస్తున్నప్పుడే ‘వర్మా’కు బ్రేక్‌లు వచ్చాయి. ‘‘నన్ను స్వేచ్ఛగా తియ్యనివ్వలేదు. ధ్రువ్‌ కెరీర్‌ దెబ్బతినకూడదని.. దీన్నిక వివాదం చేయదలచుకోలేదు’’ అని బాలా తన నోట్‌ స్టేట్‌మెంట్‌ను ముగించారు. ఏం నచ్చి ఉండకపోవచ్చు ఇ4కి ‘వర్మా’ ఫస్ట్‌ కాపీలో? ఏదీ నచ్చలేదట! రీషూట్‌కి ధ్రువ్‌ ఒక్కణ్నీ ఉంచుకుని మొత్తం టీమ్‌ని మార్చేశారు. ఆఖరికి హీరోయిన్‌ని కూడా. మొదట ఉన్న బెంగాలీ అమ్మాయి మేఘా చౌదరి ప్లేస్‌లోకి శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్‌ని అనుకున్నారు. బోనీ ‘ఎస్‌’ అని ఉంటే.. జాహ్నవీనే ఫైనల్‌.

కానీ కరెక్టేనా ఆమె ఎంపిక! కాదనిపించినట్లుంది. ఆమె ప్లేస్‌లోకి బినితా సంధూ వచ్చింది.అర్జున్‌రెడ్డి అబ్సెషన్‌లో ఉన్న ఇ4కి జాహ్నవి కన్నా మేఘ చౌదరే కరెక్ట్‌ అనిపించాలి. మేఘ పల్చగా ఉంటుంది కానీ, చూడ్డానికి షాలినీ పాండేలాగే ఉంటుంది. అదే కదా కావలసింది. మేఘలో ఇంకో ప్లస్‌.. కొత్త ముఖం. ఆ కొత్తదనం టికెట్‌లను అమ్మిపెడుతుంది. జాహ్నవి  దేశం మొత్తానికీ తెలుసు. అలాంటప్పుడు రీల్‌ రీల్‌కీ కొత్తదనం ఉండే అర్జున్‌రెడ్డి థీమ్‌కి ఆమె ఎలా సెట్‌ అవుతుంది? ఇదే ఈక్వేషన్‌ పొరపాటున హిందీ అర్జున్‌రెడ్డి ‘కబీర్‌ సింగ్‌’కి పని చేస్తే కనుక అది ‘ఫట్‌’ అనే ప్రమాదం ఉంది. తెలుగు అర్జున్‌రెడ్డిలో విజయ్‌ దేవరకొండది ఫ్రెష్‌ ఫేస్‌. కబీర్‌ సింగ్‌లో షాహిద్‌ కపూర్‌ది సేమ్‌ ఓల్డ్‌ ఫేస్‌. అందులో హీరోయిన్‌ కైరా అద్వాని. (మొదట అనుకున్న పేరు అనన్యా పాండే). కైరా నటించింది నాలుగు సినిమాలే అయినా ఆమెనూ చాలాకాలంగా చూస్తున్నట్లనిపిస్తుంది.

సందీప్‌ ధైర్యం ఏమిటో మరి! నిర్మాతలకేం పర్వాలేదు. వారికి సందీప్‌ ఉన్నాడన్న ధైర్యం ఉంది. ∙∙ జూన్‌లోనే విడుదల అవబోతున్న తమిళ్‌ అర్జున్‌రెడ్డి, హిందీ అర్జున్‌రెడ్డి.. తెలుగు అర్జున్‌రెడ్డిలా హిట్‌ అవుతాయా.. లేదా చెప్పలేం. కానీ తెలుగు అర్జున్‌రెడ్డి ట్రైలర్స్‌ వచ్చినప్పుడే చాలామంది చెప్పేశారు. ఇదేదో బ్లాక్‌ బస్టర్‌ అయ్యేలా ఉందని. పిక్చర్‌ కోసం ఎదురు చూసేలా చేసిన ట్రైలర్స్‌ అవి. సినిమా అంతా అర్జున్‌రెడ్డి చుట్టూ తిరుగుతుంది. అర్జున్‌రెడ్డి సినిమా అంతా షాలిని చుట్టు తిరుగుతాడు. అర్జున్‌రెడ్డి గొంతు, అతడి మాట ఓ రకంగా ఉండడం కూడా ఆడియెన్స్‌కి ఎక్కింది. ట్రైలర్‌లో.. ‘‘చూడండీ.. మీకో విషయం చెప్పడానికొచ్చిన.

అధ్యాపకురాలికి అర్థం గాకుండా, ఒక్క పదం ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను సరిగా వినండి’’ అని అర్జున్‌రెడ్డి.. క్లాస్‌రూమ్‌కి వెళ్లి చెప్పే సీన్, ఫుట్‌బాల్‌లో కోర్టులో ‘ఏయ్‌.. అమిత్‌’ అని పిలిచి అమిత్‌ని అర్జున్‌రెడ్డిని రెచ్చగొట్టే సీన్‌.. సినిమా రిలీజ్‌ డేట్‌ కోసం ఎదురు చూసేలా చేశాయి. అర్జున్‌రెడ్డి ట్రైలర్‌ని చూసిన కళ్లతో, వర్మా ట్రైలర్‌ని చూడలేకపోయారు ఆడియన్స్‌. తెలుగు ఆడియన్సే కాదు, తమిళ్‌ ఆడియన్స్‌ కూడా! బాలా సినిమాల్లోని సైకో సీన్‌లు, లస్ట్‌ సీన్‌లు చూస్తున్నట్లే ఉంది కానీ, కొత్తదనం లేదు. బాలా క్రియేటివ్‌ డైరెక్టర్‌. ఆయన్ని తీసుకొచ్చి తర్జుమా చేసి పెట్టి ‘గురూ నీ స్టయిల్‌లో చెయ్యి’ అంటే ఇలానే ఉంటుంది. గుడ్‌ డైరెక్టర్‌ రాంగ్‌ చాయిస్‌ అయ్యాడు. అర్జున్‌రెడ్డి లాంటి ‘కల్ట్‌’ మూవీలను సబ్‌ టైటిల్స్‌తో సరిపెట్టుకోవాలి. రీమేక్‌ చేసుకుంటే కల్ట్‌ మిస్‌ అయి, మూవీ మాత్రమే మిగులుతుంది.
 

అర్జున్‌రెడ్డి హీరోయిన్‌లు

తెలుగు: షాలినీ పాండే (25) 
చెప్పేదేముందీ! ప్రీతి క్యారెక్టర్‌కు భలే సరిపోయింది. అర్జున్‌రెడ్డి తొలి చిత్రం. ఆ తర్వాత నాలుగు చిత్రాల్లో నటించారు. మరో ఐదు చిత్రాల్లో నటిస్తున్నారు. 

తమిళం: మేఘా చౌదరి (26) 
మేఘ బెంగాలీ అమ్మాయి. మోడల్‌. ఆరేడు తమిళ చిత్రాల్లో నటించారు. ‘వర్మా’లో లవర్‌ గర్ల్‌గా బాగా సెట్‌ అయ్యారు. ప్ఛ్‌. ఆ సినిమాను మళ్లీ తీస్తున్నారు. మళ్లీ ఆమెనే తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది కానీ, నిర్మాతలు జాహ్నవి వైపు చూస్తున్నారు. చివరికి బిన్నిత దగ్గర సెటిల్‌ అయ్యారు.

జాహ్నవీ కపూర్‌ (21)
‘వర్మా’ రీషూట్‌లో మేఘకు బదులుగా జాహ్నవిని అనుకున్నారు. బాలీవుడ్‌ మూవీ ‘ధడక్‌’తో సినిమాల్లోకి వచ్చారు జాహ్నవి. ఎక్స్‌ప్రెషన్స్‌ ఇంకా కుదురుకోలేదు. అర్జున్‌రెడ్డిలోని లాస్ట్‌ సీన్‌లో (గర్భిణిగా ఉన్నప్పుడు అర్జున్‌రెడ్డితో పార్కులో ఎమోషనల్‌గా మాట్లాడే సీన్‌) ఆమె ఎలా చేస్తారన్నది రాబోయే డైరెక్టర్‌ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు జాహ్నవి లేదు. ఆమె స్థానంలోకే బనితా వచ్చింది.

బనితా సంధూ (21) 
టీవీ సీరియళ్లు, డబుల్‌ మింట్‌ చూయింగ్‌ గమ్, ఓడాఫోన్‌ వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. పదకొండో ఏట నుంచే సీరియళ్లలో నటిస్తోంది. షూజిత్‌ సర్కార్‌ దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన ‘అక్టోబర్‌’ సినిమాలో నటించింది. 

అనన్యా పాండే (19)
ఈ ఏడాది మే లో విడుదల అవుతున్న ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంలో నటిస్తోంది. నటుడు చుంకీ పాండే కూతురు. కరణ్‌ జోహార్‌ తాజా చాట్‌ షోలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌పై ప్రస్తుతం ట్రోలింగ్‌ జరుగుతోంది. వాటిని తేలిగ్గా తీసుకుని నవ్వగలుగుతోంది అనన్య.   

హిందీ: కైరా అద్వానీ (26)
ఈ నలుగురిలోనూ సీనియర్‌. ‘కబీర్‌ సింగ్‌’ హీరోయిన్‌. ఇప్పటికే ఆరు సినిమాల్లో నటించారు. మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖంలో ముగ్ధత్వమేం కనిపించదు. పరిణతి ఉంటుంది. మరి అర్జున్‌రెడ్డి హీరోయిన్‌గా సరిపోతుందా! సందీప్‌ తంటాలు పడుతున్నాడుగా. పడనివ్వండి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top