ఆజన్మాంతం రుణపడి ఉంటా

Aravinda Sametha Success Meet - Sakshi

ఎన్టీఆర్‌

‘‘ఒక సంఘటన వల్ల విషాదఛాయలు కమ్మిన మా ఇంట్లోకి వెలుతురు రేఖను, ఓ నవ్వు రేఖను తీసుకొచ్చిన నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు, చిత్ర బృందానికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. చాలా రోజుల తర్వాత మా అమ్మగారి ముఖంలో నవ్వు చూశా. ఈ ‘అరవిందసమేత...’ విజయాన్ని మా నాన్నగారికి (హరికృష్ణ) ఎందుకో గిఫ్ట్‌గా ఇవ్వాలని ఉంది సామీ (త్రివిక్రమ్‌ని ఉద్దేశిస్తూ) అని అడిగాను. మా నాన్నగారికి ఈ చిత్రం విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చేలా దోహదం చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని ఎన్టీఆర్‌ అన్నారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఎస్‌.రాధాకృష్ణ నిర్మించిన సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా థ్యాంక్స్‌మీట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ– ‘‘నా గుండె లోతుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని త్రివిక్రమ్‌గారితో చేయాలనుకున్నా. ఆ తరుణం మూడు రోజుల క్రితం ‘అరవింద సమేత  వీరరాఘవ’ చిత్రంతో రానే వచ్చింది. ఈ చిత్రం విజయం నా ఖాతాలో వేశారు త్రివిక్రమ్‌గారు. కానీ, ఇది ఆయన కలంలోని సిరా నుంచి వచ్చిన విజయం.

దర్శకునిగానే కాదు.. ఓ గురువుగా కూడా త్రివిక్రమ్‌ ఈ సినిమాను ముందుండి నడిపించారు. నిర్మాత పాత్రను వంద శాతం నిర్వహించారు చినబాబుగారు. సహకరించిన టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. త్రివిక్రమ్‌ మాట్లాడుతూ – ‘‘ఒక పరాజయం తర్వాత నేను మొదలుపెట్టిన సినిమా.. ఒక విషాదం తర్వాత విడుదలైన సినిమా ‘అర వింద సమేత వీరరాఘవ’. వీటన్నింటినీ దాటుకుని ఒక వెల్లువలాంటి విజయాన్ని ఇచ్చి, పండగను మా ఇళ్లలోకి తీసుకొచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌.

ఈ సినిమా మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికి, నాలుగు రోజుల్లో వంద కోట్లు దాటించడానికి సారధి ఎన్టీఆరే. వాళ్ల తాతగారి పేరు నిలబెట్టడం కాదు.. దాన్ని మ్యాచ్‌ చేయగల సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్‌. ఆయన లైఫ్‌లో అంత విషాదం జరిగినా... మేము ఎక్కడ నలిగిపోతామేమోనని ఆయన నలిగిపోయాడు. ఈ సినిమా విజయం కచ్చితంగా ఎన్టీఆర్‌ ఖాతాలోకే వెళుతుంది. చినబాబుగారు ఖర్చుకు వెనకాడరు. నా మొదటి విమర్శకుడు ఆయనే’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు సునీల్, నవీన్‌చంద్ర, శత్రు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్, రచయితలు రామజోగయ్యశాస్త్రి, పెంచలదాస్, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top