అజిత్‌తో స్వీటీ..

anushka shetty once again acts with ajith - Sakshi

సాక్షి, సినిమా: అజిత్‌ను ఆయన అభిమానులు స్మార్ట్‌గా చూసి చాలా ఏళ్లే అయ్యింది. నలబై(ఏళ్లు)లో పడ్డాను.. ఇంకా ఎంత కాలం యువకుడిగా నటించాలి అని ఆయనే చాలా కాలం క్రితం బహిరంగంగా అనేశారు. అన్నట్టుగానే ఆ తరువాత మెరిసిన జుట్టు, గెడ్డం అంటూ వరుసగా సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో నటిస్తూ వస్తున్నారు. వీరం, వేదాళం, వివేగం వంటి చిత్రాల్లో అజిత్‌ ఇలా రియల్‌ గెటప్స్‌తోనే తన అభిమానుల్ని అలరించారు. అయితే ఫర్‌ ఏ ఛేంజ్‌ అన్నట్లుగా తాజా చిత్రంతో మళ్లీ పాత అజిత్‌గా యంగ్‌గా కనిపించడానికి రెడీ అవుతున్నారట. అందుకు బాగా కసరత్తులు చేసి బరువు కూడా తగ్గారని తెలుస్తోంది. అజిత్‌ ఇంత స్మార్ట్‌గా మారి తాజాగా ఓ చిత్రంలో నటించనున్నారని సమాచారం. ఆయన శివ దర్శకత్వంలో నాలుగోసారి నటించనున్న చిత్రానికి ‘విశ్వాసం’ అనే టైటిల్‌ను కరారు చేసిన విషయం తలిసిందే.

వీరం,వేదాళం చిత్రాల్లో దాదాగానూ, వివేగం చిత్రంలో ఇంటర్‌ పోల్‌ అధికారిగానూ నటించిన అజిత్‌ తాజాగా మరోసారి విశ్వాసం కోసం దాదాగా మారబోతున్నారని తెలిసింది. ఇది ఉత్తర చెన్నైలోని దాదాల మధ్య జరిగే పోరు ఇతివృత్తంగా తెరకెక్కనుందట.ఈ చిత్రం 90 శాతం చెన్నైలోనే చిత్రీకరించుకోనుందని సమాచారం. సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మించనున్న ఈ బారీ చిత్రం జనవరి 19న సెట్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇందులో అజిత్‌తో జత కట్టే నాయకి ఎవరన్నది ఇంకా రివీల్‌ కాలేదు.

అయితే నటి కీర్తీసురేశ్‌తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. కాగా తాజాగా అందాల భామ అనుష్కను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ బ్యూటీ ఇంతకు ముందు ‘ఎన్నై అరిందాల్‌’ చిత్రంలో అజిత్‌తో రొమాన్స్‌ చేశారన్నది గమనార్హం. అయితే విశ్వాసంలో అనుష్క నటించే విషయాన్ని చిత్ర వర్గాలు ఇప్పటికీ అధికారిక పూర్వకంగా వెల్లడించలేదు. నటి అనుష్క నటించిన ద్విభాషా చిత్రం భాగమతి ఫస్ట్‌లుక్‌ ఇటీవల విడుదలై పెద్ద అటెన్షన్నే క్రియేట్‌ చేసింది. ఈ హర్రర్, థ్రిల్లర్‌ కథా చిత్రం సంక్రాంతికి వెండితెరపై అలజడి సృష్టించడానికి రెడీ అవుతోందని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top