బాహుబలి 450 కోట్లు దాటేసిందా? | analysts say baahubali-2 already crossed rs 450 crore mark | Sakshi
Sakshi News home page

బాహుబలి 450 కోట్లు దాటేసిందా?

May 1 2017 10:45 AM | Updated on Sep 5 2017 10:08 AM

బాహుబలి 450 కోట్లు దాటేసిందా?

బాహుబలి 450 కోట్లు దాటేసిందా?

సరిగ్గా మూడంటే మూడు రోజుల్లోనే ఏకంగా 450 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన సినిమా ఇప్పటివరకు ఏదీ లేదు.

రాంగోపాల్ వర్మ చెప్పినట్లు భారతీయ సినిమాలను బాహుబలికి ముందు, ఆ తర్వాత అని రెండు యుగాలుగా విడదీయాల్సి ఉంటుందేమో. సరిగ్గా మూడంటే మూడు రోజుల్లోనే ఏకంగా 450 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన సినిమా ఇప్పటివరకు ఏదీ లేదు. ఆ ఫీట్ అసాధ్యం కాదని, కష్టం మాత్రమేనని బాహుబలి-2 నిరూపించింది. బాహుబలి మొదటి భాగం దాదాపు రూ. 650 కోట్ల వరకు వసూలు చేసిన తర్వాత రెండో భాగం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో ఓపెన్ అయ్యింది. మొదటిరోజే ఈ సినిమాకు రూ. 121 కోట్ల కలెక్షన్లు వచ్చాయని హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్ చెప్పారు. ట్రేడ్ ఎనలిస్టు రమేష్ బాలా కూడా ఈ సినిమా వసూళ్ల గురించి ట్వీట్ చేశారు. ఆదివారంతో ముగిసిన మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్త వసూళ్లు చూసుకుంటే రూ. 450 కోట్లు దాటిపోతాయని చెప్పారు.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా.. ఆమిర్ ఖాన్ నటించిన పీకే. దానికి రూ. 792 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు కచ్చితంగా ఆ సినిమాను బాహుబలి-2 దాటేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారానే ఈ సినిమాకు రూ. 500 కోట్ల వరకు వచ్చాయని చెబుతున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా ఇక వసూళ్ల రికార్డులను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పలేమని అంటున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా ప్రతిరోజూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement