ఇది అమల వేదాంతం

Amala paul Intresting Twitter Post - Sakshi

ఎప్పుడూ ఎలా వార్తల్లో ఉండాలో తెలిసిన నటి అమలాపాల్‌. అయితే వివాదం లేకపోతే వేదాంతం వ్యాఖ్యలతో ఈ కేరళా కుట్టి సంచలనం కలిగిస్తోంది. నటిగా ఎంత స్పీడ్‌గా పేరు తెచ్చుకుందో ప్రేమ, పెళ్లి విషయాల్లోనూ అంతే దూకుడును ప్రదర్శించింది. అంతకంటే వేగంగా విడాకుల విషయంలోనూ తొందర పడింది. ఆ తరువాత  వేధింపుల ఆరోపణలు, కారు వివాదం, గ్లామరస్‌ దుస్తులతో ఫొటోలను ఇంటర్నెట్‌లకు విడుదల చేయడం, ఇవన్నీ అమలాపాల్‌ జీవితంలో సంచలనాలే అని చెప్పక తప్పదు.

వైవాహిక జీవితం నుంచి బయట పడిన తరువాత నటిగా వేగం పెంచినా,  ప్రస్తుతం కెరీర్‌ కాస్త నత్త నడక నడుస్తోందనే చెప్పాలి. ఈ అమ్మడు విష్ణువిశాల్‌తో రొమాన్స్‌ చేసిన రాక్షసన్‌ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నా, కొత్తగా అవకాశాలేమీ అమలాపాల్‌కు రాలేదు. అయితే ఆ చిత్ర హీరో రెండో పెళ్లికి సిద్ధం అవుతుందనే వదంతికి మాత్రం కారణమైంది. ఇకపోతే అంతకుముందు అంగీకరించిన ఆడై, అదో అంద పరవై పోల రెండు చిత్రాలే ప్రస్తుతం చేతిలో ఉన్నాయి.

విశేషం ఏమిటంటే ఈ రెండూ హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలే కావడం. వీటిలోనూ గ్లామర్‌ విషయంలో విజృంభిస్తోందనే ప్రచారం హోరెత్తుతోంది. వీటితో పాటు చాలా కాలం తరువాత మాతృభాషలో ఒక చిత్రం చేస్తోంది. మొత్తం మీద అమలాపాల్‌ హడావుడి తగ్గింది. ఆ కొరత పూర్తి చేయడానికే అన్నట్టుగా ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్య అటవీ ప్రాంతానికి వెళ్లి, లుంగీ పైకి బిగించి, మద్యం సీసాను చేత పట్టి తీసుకున్న ఫొటోను సోషల్‌మీడియాలకు విడుదల చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే.

తాజాగా వేదాల్ని వల్లించేలా సొంత కాళ్లపై నిలబడాలి. అది కూడా లోకం నిన్ను కిందకు తోసినప్పుడు లేచి తలెత్తుకుని నిలబడాలి అనే వ్యాఖ్యలను తన ట్విట్టర్‌లో పేర్కొంది. దీంతో ఈ వ్యాఖ్యల వెనుక కథేంటనే విషయం గురించి ఆరా తీసే పనిలో సినీ వర్గాలు పడ్డాయి. అలా సంబంధం లేని వేదాంత వ్యాఖ్యలతో అమలాపాల్‌ వారికి పని చెప్పడంతో పాటు మరోసారి వార్తల్లో నానుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top