నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది

After Four Years I Got Hit With Bheeshma Says Nithin - Sakshi

‘‘భీష్మ’ సినిమాను ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా టీమ్‌ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న హిట్‌ ఇది. నేను బాగా నటించాను.. నవ్వించానని అంటుంటే సంతోషంగా ఉంది. డైరెక్టర్‌ వెంకీని కాపీ కొట్టానంతే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు’’ అని నితిన్‌ అన్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవంలో నితిన్‌ మాట్లాడుతూ –‘‘భీష్మ’ హిట్‌తో చాలామందికి వెంకీ జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్‌ వచ్చింది.. అందుకే ఎమోషన్‌ అవుతున్నా. ఈ సినిమాలో రష్మికతో కంటే సంపత్‌ రాజ్‌తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా కుదిరిందని అంటున్నారు. ‘ఛలో’తో వెంకీకి, ‘భీష్మ’తో నాకు రష్మిక బ్రేక్‌ ఇచ్చింది. ‘అ ఆ’తో నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్టిచ్చిన బ్యానర్‌లోనే నాకు మళ్లీ హిట్‌ వచ్చింది.. ఈ సంస్థలో మరెన్నో సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

‘భీష్మ’ చిత్రం పంపిణీదారుడు, నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ –‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో నేను చెప్పినట్లే ప్రేక్షకులు సూపర్‌ హిట్‌ చేశారు. ‘ఛలో’తో హిట్‌ కొట్టిన వెంకీ ‘భీష్మ’తో సూపర్‌ హిట్‌ కొట్టాడు.. ఇక హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నాడు. నితిన్‌తో ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంతో హిట్‌ కొట్టాలనుకున్నాం. కానీ, కుదరలేదు. హీరోలతో పోటీ పడుతూ రష్మిక డ్యాన్స్‌ చేస్తోంది. సినిమాలో మంచి కామెడీ, కంటెంట్‌ బలంగా ఉంటే ప్రేక్షకులు హిట్‌ చేస్తారని ‘ప్రతిరోజూ పండగే’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’, ‘భీష్మ’ సినిమాలు నిరూపించాయి’’ అన్నారు.

వెంకీ కుడుముల మాట్లాడుతూ –‘‘నా కథని నమ్మి అవకాశం ఇచ్చిన చినబాబు, వంశీ, నితిన్‌గార్లకు థ్యాంక్స్‌. నా సాంకేతిక నిపుణులంతా బాగా సహకారం అందించడం వల్లే నేను అనుకున్న విధంగా సినిమా తీశాను. ‘దిల్‌’ సినిమా నుంచి నితిన్‌ను అభిమానిస్తూ వస్తున్నా. కలిసి పని చేసేటప్పుడు ఆయన ప్రవర్తనకూ నేను అభిమానినైపోయా’’ అన్నారు. ‘‘భీష్మ’లో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు వెంకీకి రుణపడి ఉంటాను. భీష్మ పాత్రలో నితిన్‌ను చూసి అభిమానిని అయిపోయాను’’ అన్నారు రష్మికా మందన్నా. ఈ విజయోత్సవంలో సూర్యదేవర నాగవంశీ, కెమెరామేన్‌ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, నటులు ‘శుభలేఖ’ సుధాకర్, సంపత్‌ రాజ్, పాటల రచయితలు కాసర్ల శ్యామ్, శ్రీమణి, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాహి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top