
అదితీ రావ్ హైదరీ
‘‘విమర్శలకు దూరంగా పారిపోలేం. ఎలాంటి విమర్శని అయినా పాజిటివ్‌గా తీసుకోవాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తులను విమర్శించేవాళ్లు ఏదో సమస్యతో బాధ పడుతున్నారని నా అభిప్రాయం’’ అన్నారు అదితీ రావ్ హైదరీ. సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి అదితీ మాట్లాడుతూ – ‘‘విమర్శించేవాళ్లకు ఏదో విషయంలో కోపం అయినా ఉండి ఉండాలి. లేకపోతే వాళ్ల జీవితం పట్ల వాళ్లకు ఏదైనా బాధ అయినా ఉండి ఉండాలి. ఆ కోపాన్ని సోషల్ మీడియాలో చేసే విమర్శల ద్వారా తీర్చుకుంటున్నారనుకుంటున్నాను.
వాళ్ల విషయంలో మనం ఒక్కటే చేయగలం అని నా ఫీలింగ్.. అదేంటంటే జాలి చూపించడం. అలాగే వాళ్లు బాగుండాలని కోరుకోవాలి. ఒక్కోసారి నేను వాళ్లకు ‘మీకు ఈరోజు బాగుండాలని కోరుకుంటున్నాను’ అని రాసి పంపిస్తుంటాను. వాళ్ల మంచి కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ల కోపం వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది’’ అన్నారు. ఆమె నటించిన హిందీ థ్రిల్లర్ ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’ వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కానుంది. ‘పద్మావత్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అదితీ తెలుగులో ‘చెలియా’, ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో కనిపించారు.