వేలానికి నటి శ్రీవిద్య ఇల్లు

Actress Srividya House Auction in Chennai - Sakshi

సాక్షి, చెన్నై : దివంగత నటి శ్రీవిద్య ఇంటిని ఆదాయ పన్ను శాఖ వేలం వేయనుంది. సీనియర్‌ నటి శ్రీవిద్య. గత 1966 నుంచి 2000 సంవత్సరం వరకూ ప్రముఖ నటిగా రాణించిన శ్రీవిద్య తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో పలు భాషల్లో నటించారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో కథానాయకిగానూ కొన్ని చిత్రాల్లో నటించిన శ్రీవిద్య కేన్సర్‌ వ్యాధితో 2006లో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో మరణించారు. అయితే ఆమెను చివరి దశలో మలయాళ నటుడు, ఆ రాష్ట్ర శాసన సభ్యుడు గణేశ్‌కుమార్‌ బాగోగులు చూసుకున్నారు. 

శ్రీవిద్యకు చెన్నై, అభిరామపురంలోని సుబ్రమణియంపురం వీధిలో రెండు అంతస్తుల ఫ్లాట్‌ ఉంది. అందులో ప్రస్తుతం డాన్స్‌ స్కూల్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఇంటికి చాలా కాలంగా పన్ను  చెల్లించకపోవడంతో డాన్స్‌ స్కూల్‌ ద్వారా వస్తున్న అద్దెను ఆదాయ పన్ను శాఖ జమ చేసుకుంటోంది. ఇంటి పన్ను, వడ్డీ, వేలం ఖర్చుల కోసం ఆ ఇంటినిప్పుడు వేలం వేయడానికి ఆ శాఖ సిద్ధమైంది. 1,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆ ఫ్లాట్‌ను ఆదాయ పన్ను శాఖ రూ.1,17,20,000గా ధర నిర్ణయించింది.  ఈ నెల 27వ తేదీన ఇంటిని వేలం వేయనున్నట్టు ప్రకటించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top