పేదల కోసం...

పేదల కోసం... - Sakshi


ఏ.ఆర్. రెహమాన్... సినీ సంగీతానికి రారాజు. స్వదేశంలో కన్నా ఎక్కువగా విదేశాల్లోనే గడుపుతూ, ప్రపంచమంతా మెచ్చుకొనే సంగీతాన్ని అందిస్తున్న మ్యూజిక్ మెజీషియన్. ఇటీవలే ఆయన మీద ‘మొజార్ట్ ఫ్రమ్ మద్రాస్’ డాక్యుమెంటరీ వచ్చింది. కానీ, ఇంద్రుడు... చంద్రుడు అని పొగుడుతూ తన మీద వచ్చిన ఆ డాక్యుమెంటరీ చూడడానికి రెహమాన్ సిగ్గుల మొగ్గయిపోయారు. ‘‘నా గురించి నన్ను మాట్లాడమంటే, చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ, దర్శకులు డేనీ బోయల్, మణిరత్నం లాంటి వాళ్ళు నాతో పనిచేయడం ఎలా ఉంటుందో చెబుతుంటే, అలా చూస్తుండిపోయా.

 

 వాళ్ళ మాటల వల్ల నన్ను అందరూ ఇష్టపడుతున్నారు’’ అని రెహమాన్ వ్యాఖ్యానించారు.  వయసు పెరుగుతున్న కొద్దీ, అనుభవం వస్తున్నకొద్దీ వర్ధమాన కళాకారులతో పంచుకోవడానికి ఎంతో ఉందని అర్థమవుతోందంటున్న రెహమాన్ తన చిరకాలవాంఛ ‘మ్యూజిక్ స్కూల్’ను కొన్నేళ్ళ క్రితమే నెరవేర్చుకున్నారు. రోజువారీ వ్యవహారాలను తన సోదరి చూస్తుంటే, వాళ్ళతో క్రమం తప్పకుండా సంప్రతింపుల్లో ఉంటున్నారు రెహమాన్. ఆర్థికంగా వెనుకబడినవారి కోసం ఆ మధ్య సొంతంగా ‘ది సన్‌షైన్ ఆర్కెస్ట్రా’ అంటూ ఒక మ్యూజికల్ బ్యాండ్‌ను ప్రారంభించిన ఆయన ఆ బ్యాండ్‌తో ప్రపంచమంతటా ప్రదర్శనలివ్వాలనుకుంటున్నారు.

 

 అలా తన మ్యూజిక్ స్కూల్‌లోని ప్రతిభావంతులైన విద్యార్థులకూ, బయట ఉండే ఇతర యువ సంగీతకళాకారులకూ ఆసక్తికరమైన పని కల్పించాలనుకుంటున్నారు. సినిమాల సంగతికొస్తే, ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే జీవితంపై వస్తున్న ‘పీలే’ అనే అంతర్జాతీయ చిత్రానికీ, ప్రసిద్ధ ఇరానియన్ దర్శకుడు మజిద్ మజీదీ తీస్తున్న ‘ముహమ్మద్’కీ సంగీతం సమకూరుస్తున్నారు. నలభై ఎనిమిదేళ్ళ వయసుకే ఇంత సాధించిన రెహమాన్ ‘‘ప్రతిభ ఉన్నప్పటికీ, జీవితంలో పైకి రాని వ్యక్తులను చూసినప్పుడు దేవుడికి ఎంత కృతజ్ఞులమై ఉండాలో తెలుస్తుంది’’ అంటారు. ఎదిగినకొద్దీ ఒదగడమంటే ఇదే!

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top