న్యూఢిల్లీ: ఉర్దూ రచయిత, కవి గాలిబ్(విజేత అని అర్థం)గా సుప్రసిద్ధుడైన మీర్జా అసదుల్లా బేగ్ ఖాన్ 220 జయంతి సందర్భంగా సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను పెట్టింది. ఆయన యానిమేషన్ ఫొటోతో డూడుల్‌ను రూపొందించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో సూర్యుడు, మసీదు నేపథ్యంతో భవనం బాల్కనీలో పేపరు, పెన్నుతో గాలిబ్ నిలబడినట్లు అందులో చూపింది.
గాలిబ్ ఆగ్రాలోని కాలా మహల్‌లో 1797లో జన్మించారు. మొగల్ చక్రవర్తి ఆఖరు కాలంలో, భారత్‌ను బ్రిటిషర్లు ఆక్రమించుకున్న కాలంలో ఉర్దూ, పర్షియన్ భాషల్లో రచనలు సాగించి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసిన ప్రముఖుల్లో ఒకరు. అతని గజల్స్‌కు పలు రూపాల్లో వ్యాఖ్యానాలు రాగా వివిధ వర్గాల ప్రజలు పాడుకున్నారు. గాలిబ్ తన 11వ ఏటనే కవిత్వం రాయడం మొదలుపెట్టారు. ఆయన మాతృభాష ఉర్దూ అయినప్పటికీ పర్షియన్, టర్కిష్ భాషల్లోనూ అంతేస్థాయి ప్రావీణ్యం ప్రదర్శించారు. ఆయన విద్యాభ్యాసం పర్షియన్, అరబిక్ భాషల్లో సాగింది. 1869 ఫిబ్రవరి 15న గాలిబ్ తుదిశ్వాస విడిచారు. ఆయన నివాసం గాలిబ్ స్మృతి భవన్‌గా రూపాంతరం చెందింది. నిజాముద్దీన్ ప్రాంతంలోని చౌసాత్ ఖామ్బాలో ఆయన సమాధి ఉంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
