ఒంటరి మహిళలే టార్గెట్‌ | Chain Snatching Target Single Women | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళలే టార్గెట్‌

Mar 5 2018 12:28 PM | Updated on Mar 5 2018 12:28 PM

Chain Snatching Target Single Women - Sakshi

జోగిపేట(అందోల్‌): వరుస చైన్‌ స్నాచింగ్‌లతో జోగిపేట పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానిక వాసవీనగర్‌ కాలనీలో గత నెల 26న అనూష అనే మహిళ మెడలో నుంచి చైన్‌ను బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన సంఘటన మరవకముందే ఆదివారం ఉదయం 8:30 ప్రాంతంలో మూడు చోట్ల ఒకేసారి చైన్‌ స్నాచింగ్‌ సంఘటనలు జరిగాయి. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలనే టార్గెట్‌గా చేసుకొని చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు.

ఘటనలు జరిగిన తీరును గమనిస్తే కేవలం 5 నిమిషాల వ్యత్యాసంతో జరగడంతో వేర్వేరు వ్యక్తులు ఈ సంఘటనలో పాల్గొన్నట్లు అర్థమవుతుంది. అంతే కాకుండా ఒక బైక్‌ నడిపే వ్యక్తి క్యాప్‌ పెట్టుకోగా, మరో ఘటనలో టోపీ పెట్టుకోలేదని బాధితులు చెబుతున్నారు. వెనుక ఉన్న వారు మాత్రం ముఖానికి కర్చీఫ్‌ను కట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఒక ముఠానే జోగిపేటను ఎంచుకొని ఈ సంఘటనలకు పాల్పడుతోందని స్థానికులు భావిస్తున్నారు. వారం రోజుల్లో నాలుగు సంఘటనలు జరగడంతో పోలీసులు కూడా విమర్శలకు గురవుతున్నారు.

భయం...భయం
జోగిపేటలో ఆదివారం జరిగిన సంఘటన దావానలంలా వ్యాపించడంతో మహిళలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కొందరు మహిళలు భయంతో బంగారు గొలుసులను ఇంట్లో పెట్టి రోల్డ్‌గోల్డ్‌ వేసుకుంటున్నారు. పోలీసులు వీధుల్లో మఫ్టీలో తిరిగి ఇలాంటి నేరాలపై నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పని చేయని సీసీ కెమెరాలు
పాఠశాల యాజమాన్యం బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఆదివారం కావడంతో వారు బంద్‌ చేసి ఉంచారు. ఎస్‌ఐ రమణ పోలీసు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పక్కనే ఉన్న శ్రీ బాలాజీ ఆసుపత్రి కెమెరాలను పరిశీలించినా లాభం లేకుండా పోయింది. పోలీస్‌ స్టేషన్‌ వైపు పారిపోయినట్లు బాధితులు చెప్పడంతో స్టేషన్‌ ముందు ఉన్న కెమెరాలో పరిశీలించాలని రజకులు కోరగా వైరు తెగిపోయిందని చెప్పడంతో వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో వారంతా పోలీస్‌ స్టేషన్‌ ముందు రాస్తారోకో చేశారు.

ఎస్పీకి సమాచారం ఇచ్చిన ఎంపీ
జోగిపేటలో రజకులు రాస్తారోకో చేస్తుండడంతో అదే సమయంలో అటువైపుగా వెళుతున్న జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ వాహనం కూడా నిలిచిపోయింది. బాధితులంతా ఎంపీ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేశారు. బాధితురాలు లక్ష్మి కూడా ఎంపీ వద్దకు వెళ్లి తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఎస్పీకి ఫోన్‌లో ఎంపీ సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసు అధికారుల ద్వారా సంఘటనల వివరాలను ఎస్పీ తెలుసుకున్నట్లు సమాచారం.

రెండు తులాల చైన్‌ ఎత్తుకెళ్లారు
వాసవీనగర్‌ కాలనీలో బైకుకు నేను సైడ్‌ ఇవ్వడానికి పక్కకు జరిగిన. ఆ బైకు నా దగ్గర వరకు వచ్చి నా మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని పోలీస్‌ స్టేషన్‌ వైపే పారిపోయాడు. బైక్‌ నడిపే వ్యక్తిది చిన్న వయస్సు. ఎర్రగా ఉన్నాడు. వెనుక ఉన్న వ్యక్తి ముఖానికి దస్తీ కట్టుకట్టుకొని ఉన్నాడు. కొన్ని క్షణాల్లోనే ఇదంతా జరిగిపోయింది. ఆ వ్యక్తిని చూస్తే గుర్తు పడతాను. పోలీసులు నా గొలుసు నాకు ఇప్పించాలి. ఎంపీ గారికి కూడా నా బాధ చెప్పుకున్నా. నేను రూ. 60వేలు ఎప్పుడు సంపాదించుకోగలను.
–గంగన్నోల్ల లక్ష్మి (బాధితురాలు), జోగిపేట

వెనుక నుంచి వచ్చి లాగారు
నేను మా అత్తకు టిఫిన్‌ ఇచ్చి ఇంటికి తిరిగి వస్తున్నా. వెనుక నుంచి బైక్‌ వస్తుండడంతో పక్కకు జరిగి తోవ ఇస్తుండగా నా దగ్గరకు వచ్చి చైన్‌ను పట్టుకున్నారు. నేను కూడా చైన్‌ను పట్టుకొని అరవడంతో చుట్టు పక్కల వాళ్లు వచ్చారు. వాళ్లను చూసి నన్ను తోసేసి పారిపోయారు. గొలుసు తెగిపోయింది.  నేను గర్భవతిని కావడంతో చురుకుగా కదలలేకపోయాను. కాలనీ వాళ్లు రావడంతో నా గొలుసు నాకు దొరికింది. పోలీసులు వీరిపై నిఘా పెట్టాలి.
– రజిత (బాధితురాలు), జోగిపేట

చైన్‌ స్నాచింగ్‌ ఘటనలపై నిఘా
జోగిపేటలో జరిగిన చైన్‌స్నాచింగ్‌ ఘటనలపై నిఘా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే 9490619661, 9440901831 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. ప్రధాన రహదారుల పక్కన ఉన్న వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు పోలీసులకు సహకరించాలి. వారం రోజుల్లో నాలుగు సంఘటనలపై విచారణ చేపడతాం. వాహనాలను బాధితులు గుర్తిస్తే బాగుండేది. ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూస్తాం. ప్రజలు కూడా మాకు సహకరించాలి.
– తిరుపతి రాజు, సీఐ జోగిపేట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement