రెడ్‌ మీట్‌తో క్యాన్సర్‌.. గుట్టు తెలిసింది!

Consuming red meat may increase cancer risk - Sakshi

ఆరోగ్యానికి శాకాహారం మంచిదా? మాంసాహారం మంచిదా? ఈ చర్చ యుగాలుగా నడుస్తూనే ఉంది. అయితే కొన్నిరకాల మాంసాల (రెడ్‌ మీట్‌)తో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగతాయని ఇప్పటికే కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కారణమేమిటన్నది మాత్రం ఇప్పటి వరకు తెలియదు. ఈ లోటును కాస్తా పూరించారు నెవెడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జంతువులతోపాటు కొన్ని రకాల చేపలు, పాల ఉత్పత్తుల్లో సీఎంఏహెచ్‌ అనే జన్యువు ఉంటుంది. ఇది న్యూ5జీసీ అనే చక్కెర కణాలను ఉత్పత్తి చేస్తూంటుంది. మనుషుల్లోనూ సీఎంఏహెచ్‌ జన్యువు ఉన్నప్పటికీ దాంట్లో కొన్ని మార్పులు ఉంటాయి.

ఫలితంగా న్యూ5జీసీ చక్కెర కణాలు ఉత్పత్తి కావు. రెడ్‌ మీట్‌ వంటివి తిన్నప్పుడు వాటిలోని న్యూ5జీసీ చక్కెరలు శరీరంలోకి చేరతాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థ వీటిని పరాయి కణాలుగా గుర్తిస్తుంది. వదిలించుకునే తీరులో స్పందిస్తుంది. ఇది కాస్తా వాపు/మంటలకు, కీళ్లనొప్పులకు, చివరకు క్యాన్సర్‌కూ కారణమవుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూ5జీసీ చక్కెరలు ఉత్పత్తి చేసే జంతువులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు నెవెడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దాదాపు 322 జంతు జన్యుక్రమాలను పరిశీలించారు. పరిణామ క్రమంలో కొన్ని వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు మానవుల్లోని సీఎంఏహెచ్‌ జన్యువు పనిచేయకుండా పోయిందని కొన్ని జంతువులు, చేపల్లో ఈ జన్యువు అలాగే ఉండటం, వాటి మాంసం మనం తీసుకోవడం వల్ల సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించామని రెనో అనే శాస్త్రవేత్త చెప్పారు. మరిన్ని పరిశోధనల ద్వారా దీనిపై అవగాహన పెంచుకోగలిగితే వేటి వల్ల సమస్య ఎక్కువవుతుందో అర్థమవుతుందని చెప్పారు.




 

Read also in:
Back to Top