సాక్షి, విజయవాడ : పోలవరం అథారిటీ కమిటీ గురువారం ఇక్కడ సమావేశమైంది. ఈ సమావేశానికి అథారిటీ సీఈవో సౌమిత్రి హల్దార్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇతర ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. టెండర్ల వివాదం పరిష్కరించే దిశగా చర్చలు జరుపుతున్నారు.
ఈ సమావేశంలో పెంచిన టెండర్లను అమోదించాలా? వద్దా? అనే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే పెంచిన అంచనాలపై అధికారుల వివరణ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. గత నవంబర్ 18వ తేదీన రూ.1395 కోట్లతో జలాశయం అంతర్గత పనులకు రాష్ష్ట ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే ఈ టెండర్లను నిలిపివేయాలని నవంబర్ 27న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖరాసింది. అయినా ఖాతరు చేయకుండా అంచనా వ్యయాన్ని రూ.1483 కోట్లకు పెంచి రాష్ష్ట సర్కార్ ఈ ప్రోక్యూర్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై నీటిపారుదల అధికారులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సమావేశమై చర్చించారు.
పాత కంట్రాక్టర్‌కు నెల రోజులు గడువు ఇవ్వాలని, అప్పటికీ పనుల్లో పురోగతి లేకపోతే టెండర్లపై నిర్ణయం తీసుకుందామని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై చర్చించేందుకు పోలవరం అథారిటీ కమిటీ భేటీ కావాలని కేంద్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఈనెల 4వ తేదీన లేఖ రాశారు. ఈ నేపధ్యంలోనే విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో గురువారం పోలవరం అథారిటీ కమిటీ భేటీ అయింది.