సుఖాంతమైన ప్రేమ కథ | Fullstop to love.. married lover | Sakshi
Sakshi News home page

సుఖాంతమైన ప్రేమ కథ

Jan 12 2018 6:24 PM | Updated on Aug 21 2018 7:17 PM

చందర్లపాడు: ప్రేమ కథ సుఖాంతమైంది. వేర్వేరు సామాజికవర్గాలు కావడం, పెళ్ళికి పెద్దల అంగీకారం లేనప్పటికీ అనేక మలుపుల మధ్య ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు. ఆరేళ్లుగా ప్రేమిస్తూ పెద్దలు ఒప్పుకోలేదన్న సాకుతో ముఖం చాటేసిన యువకుడు పోలీసుల కౌన్సెలింగ్‌తోపాటు ఎమ్మార్పీఎస్‌ నాయకుల రంగప్రవేశంతో పెళ్లికి ఒప్పుకోకతప్పలేదు. ఆరేళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్‌ పెట్టి గ్రామ దేవత సాక్షిగా ఒక్కటయ్యారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వేదాంతం పవన్‌కుమార్‌(24), తిరువూరు మండలం చౌటపల్లికి చెందిన దేవి(20)కి మధ్య ఆరేళ్ళుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఫోన్‌లో మాట్లాడుకోవడమేగాక అప్పుడప్పుడూ కలిసి తిరిగేవారు. వీరి సామాజిక వర్గాలు వేరైనందున విషయం దేవి ఇంట్లో తెలిసి మందలించారు. అయినా ఆమె పవన్‌ ఒత్తిడి మేరకు స్నేహం కొనసాగించింది. పెళ్లి మాట వచ్చేసరికి ముఖం చాటేశాడు.

ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం తిరువూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకునేందుకు రెండు నెలల గడువు కోరిన పవన్‌ అప్పటినుంచి ముఖం చాటేశాడు. ఫోన్‌లోకూడా స్పందించకపోవడంతో ఈ నెల 10వ తేదీ ఉదయం పవన్‌ ఇంటికి వచ్చిన దేవి జరిగినదానిపై అతని తల్లిదండ్రులకు చెప్పింది. వారినుంచి సరైన సమాధానం రాకపోవండతో అక్కడే దీక్ష చేపట్టింది. ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆమెకు ఆసరాగా నిలిచారు. పవన్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆమె వద్ద ఉన్న సాక్ష్యాల ఆధారంగా జరగబోయే పరిణామాలపై హెచ్చరించారు. విధి లేని పరిస్థితిలో పవన్‌ పెళ్ళికి అంగీకరించగా గురువారం రాత్రి చందర్లపాడు గ్రామ దేవత అలివేలమ్మ సాక్షిగా ఒక్కటయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement