‘మరుగు’న‘బడి’!

Cleanliness Washrooms In Govt Schools - Sakshi

పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై అలసత్వం 

ఇబ్బంది పడుతున్న విద్యార్థినులు 

కరువైన అధికారుల పర్యవేక్షణ  

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మరుగుదొడ్ల నిర్మాణంలో అడుగడుగునా అలసత్వం కనిపిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మల, మూత్ర విసర్జన కోసం ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టింది. ముఖ్యంగా విద్యార్థినుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రతి పాఠశాలలో చేపట్టారు. అయితే నిర్మాణాలు సకాలంలో పూర్తికాకపోవడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయినులు ఇబ్బంది పడుతున్నారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాల్సిన ఆవశ్యకతను అధికారులు గుర్తించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 251 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గుర్తించిన పనులపై నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించారు. దీంతో పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.1.20లక్షల నుంచి రూ.1.50లక్షల వరకు మంజూరు చేసింది. ఇందులో విద్యాశాఖ 60శాతం, ఉపాధిహామీలో 40శాతం నిధులను వినియోగించాల్సి ఉంటుంది.

 
తొమ్మిది శాతమే పూర్తి.. 
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. అనుకున్న మేరకు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయలేకపోతున్నారు. అనేక పాఠశాలల్లో నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 251 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినా.. కట్టడాలు మాత్రం పూర్తి కాలేదు. ఇప్పటివరకు కేవలం 94 పాఠశాలల్లో మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 70 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా.. 24 నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే మొత్తం మరుగుదొడ్ల లక్ష్యంలో 9.56 శాతం నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి.

మిగతావి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి. నిర్మాణాలకు నిధులు విడుదలవుతాయో? లేదో? అనే సందేహంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. వీటి నిర్మాణం విషయంలో అధికారులు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు శ్రద్ధ తీసుకుంటేనే నిర్మాణాలు ముందుకు సాగే అవకాశం ఉంది.

 
మరుగుదొడ్లు లేకపోవడంతో.. 
పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. మూత్ర విసర్జన చేయాలంటే సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాల్సి ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. ఎస్‌ఎంసీలతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేలా బాధ్యత తీసుకోవాల్సి ఉంది. పలుచోట్ల గతంలో సర్పంచ్‌లు కూడా కాంట్రాక్టర్లుగా వ్యవహరించగా.. వీరి పరిధిలోని నిర్మాణాలు ముందుకు సాగలేదు.

 
పలు పాఠశాలల్లో నత్తనడకన.. 
జిల్లాలోని పలు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. తిరుమలాయపాలెం మండలంలోని పాఠశాలల్లో 12 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అయితే ఇక్కడ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఖమ్మం రూరల్‌ మండలంలో 10 మరుగుదొడ్లు మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. కారేపల్లి మండలంలో 12 మరుగుదొడ్లు మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది.

 
నేలకొండపల్లిలో 10 మంజూరు కాగా.. రెండు మాత్రమే ప్రారంభమయ్యాయి. కామేపల్లిలో 16 మంజూరు కాగా.. ఒకటి మాత్రమే ప్రారంభమైంది. ఖమ్మం అర్బన్‌లో 17 మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది.

 
త్వరితగతిన పూర్తి చేయిస్తాం.. 
మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఉపాధిహామీ సిబ్బంది మరుగుదొడ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణాలు ప్రారంభం కాని వాటిపై దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. 
– మదన్‌మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి  

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top