శిశుగృహపై చిన్నచూపు!

neglecting children's infant home building - Sakshi

అసంపూర్తిగా భవన నిర్మాణం

రూ.13లక్షలతో పనులు

మరో రూ.4లక్షలకు అదనపు నిధులు

అయినా అరకొర వసతులే

అధికారుల వైఫల్యం..ప్రజలకు శాపం

మంకమ్మతోట : తల్లిదండ్రులు వదిలేసిన.. అనాథలుగా దొరికిన శిశువులను చేరదీసి సంరక్షించే శిశుగృహ భవన నిర్మాణంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. శిశుగృహలోని పిల్లలకు మరిన్ని వసతులు, సౌకర్యాలు, మెరుగైన సంరక్షణ అందించాలనే సంకల్పంతో చేపట్టిన భవనం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో శిశుగృహ కు ప్రత్యేక భవనమంటూ లేకపోవడంతో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో గృహాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని బాలసదన్‌లో రెండుగదుల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో పిల్లల ఆలనాపాలన చూసేందుకు సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిశువులకు గాలి, వెలుతురుతోపాటు ఆహ్లాదరకమైన వాతావరణం ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని భావించిన సర్కారు.. మెరుగైన వసతుల కోసం ప్రత్యేక భవన నిర్మాణానికి సంకల్పించింది. బాలసదన్‌ ఆవరణలోని ఖాళీస్థలంలో పనులు చేపట్టేందుకు ఉపక్రమించింది. పనులు పూర్తిచేసినప్పటికీ అందులో సౌకర్యాలు మాత్రం పూర్తిగా కల్పించడంలో విఫలమైంది. దాదాపు ఆర్నెల్లుగా ఇదే పరిస్థితి ఉన్నా.. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.
 

భవనానికి నిధులు
బాలసదన్‌ ఆవరణలోగల స్థలంలో శిశుగృహ భవన నిర్మాణానికి రూ.13లక్షలు మంజూరు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ భవన నిర్మాణం చేపట్టింది. ఆగస్టుకు ముందే పూర్తయింది. భవనం లోపల పనులతోపాటు మరుగుదొడ్డి పైప్‌లైన్, సెప్టిక్‌ ట్యాంక్‌ వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ సౌకర్యాలు కల్పించేందుకు ఎస్టిమేషన్‌ నివేదిక అందించారు. ఈ పనులు పూర్తికావాలంటే మరో 9లక్షలు అదనంగా మంజూరు చేయాలని కోరారు. నివేదిక పరిశీలించిన కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సెప్టెంబర్‌ 23న స్వయంగా శిశుగృహభవనాన్ని సందర్శించి పనులు పరిశీలించారు. అధికారులు తెలిపిన వాటిలో కొన్ని తగ్గించి రూ.4లక్షలు మంజూరు చేశారు. అయినా.. ఇప్పటివరకు పనులు పూర్తికావడం లేదు. కలెక్టర్‌ పర్యవేక్షణలో జరుగుతున్న శిశుగృహ భవనం ఆలస్యం కావడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అనుమతి ఉందా..?
శిశుగృహా భవన నిర్మాణానికి సంబంధించి నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. నగర పాలక సంస్థ సంబంధిత శాఖ అధికారులు వారంక్రితం అనుమతి తీసుకోలేదని తెలుపుతూ నిర్మాణం చుట్టకొలతలు తీసుకున్నట్లు సమాచారం.

పూర్తి చేయాల్సిన పనులు
మరుగుదొడ్డి పైప్‌లైన్‌ నిర్మాణం, సెప్టిక్‌ ట్యాంక్, పిల్లలు కిందపడకుండా భవనం ముందు అరుగుకు ఫెన్సింగ్, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేంలా భవనం ముందు స్థలంలో గార్డెన్, లోపల బయట రంగులు వేయడం, ఏసీ లేదా కూలర్స్‌ ఏర్పాటు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేసి చిన్నారులకు ఆహ్లాదకరమైన సంరక్షణ అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top