
వూహాన్: ప‌్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చుకుని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్.. దాని జన్మస్థానంగా భావిస్తున్న వూహాన్‌లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడ 76 రోజుల లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే నిబంధనలు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఇక వైరస్ బెడద తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ కేసులు నమోదవతుండటం అధికారులను కలవరానికి గురి చేస్తోంది. గత వారం నుంచి నగరంలో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన చైనా అధికారులు వూహాన్‌లోని జనాభా అందరికీ కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా పది రోజుల్లో సుమారు 11 మిలియన్ల (కోటి పది లక్షల మంది) జనాభాను పరీక్షించనున్నారు. (వూహాన్‌లో ఆరు కొత్త కరోనా కేసులు)
ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. లాక్‌డౌన్ తర్వాత 28 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని వూహాన్ నగరంలో మళ్లీ కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా జనవరి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు వూహాన్ నగరాన్ని నిర్బంధంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 42,69,684 కరోనా కేసులు నమోదవగా, రెండున్నర లక్షల పైచిలుకు జనాభా మరణించారు. 15 లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. భారత్ విషయానికొస్తే లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నాటికి 70,756 పాజిటివ్ కేసులు నమోవదగా 2293 మంది మృతి చెందారు. 22454 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. (వూహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత)