వూహాన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత

China lifts coronavirus lockdown after 77 days - Sakshi

నగరం దాటేసిన లక్షల మంది

  టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల క్యూలు

  రైళ్ల ద్వారా ఒక్క రోజులో 55 వేల మంది ప్రయాణం

బీజింగ్‌/వూహాన్‌: హమ్మయ్యా.. ఎట్టకేలకు కరోనా వైరస్‌ విషయంలో ఒక శుభవార్త వినిపించింది. వైరస్‌ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వూహాన్‌ నగరంలో 73 రోజుల లాక్‌డౌన్‌కు ప్రభుత్వం బుధవారం ముగింపు పలికింది. చైనా మొత్తమ్మీద మంగళవారం 62 కొత్త కేసులు నమోదయ్యాయని, షాంఘై, హుబే ప్రావిన్సుల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని చైనా ఆరోగ్య కమిషన్‌ అధికారులు బుధవారం తెలిపారు. కొత్త కేసుల్లో 59 మంది మంది విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు కాగా, మిగిలిన మూడు కేసులు స్థానికమైనవని చెప్పారు. దీంతో విదేశాల నుంచి తిరిగి వచ్చిన కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 1,042కు చేరుకుంది. అంతేకాకుండావైరస్‌ సోకినప్పటికీ లక్షణాలేవీ కనిపించని 1,095 మందిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది. చైనాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ సుమాఉ 3,333 మంది కోవిడ్‌కు బలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి మొత్తం 81,802 మంది కోవిడ్‌ బారిన పడగా, 77,279 మంది చికిత్స తరువాత జబ్బు నయమైన ఇళ్లకు చేరారు.  

వూహాన్‌ బయటకు లక్షల మంది..
కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో వూహాన్‌లో జనవరి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించారు. తాజాగా బుధవారం లాక్‌డౌన్‌పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడంతో వూహాన్‌ ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లడం మొదలుపెట్టారు. దాదాపు 1.10 కోట్ల  మంది వూహాన్‌ నగరం నుంచి బయటకు వెళ్లినట్లు అంచనా. ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు ఉన్న వారందరూ స్వేచ్ఛగా తిరిగే అవకాశం లభించడంతో ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్‌గేట్లపై కిలోమీటర్ల పొడవైన క్యూలు కనిపించాయి.  కొన్ని ఫ్యాక్టరీలు, కార్యాలయాలు పనిచేయడం మొదలుపెట్టడంతో రోడ్లపై తిరుగుతున్న వాహనాలు కనీసం నాలుగు లక్షల వరకూ ఎక్కువ అయ్యాయని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. వూఛాంగ్‌ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయమే సుమారు 442 మంది గువాంగ్‌డాంగ్‌ ప్రావిన్సుకు రైల్లో ప్రయాణం కాగా, రోజు ముగిసేసరికి 55 వేల మంది రైల్వే సర్వీసులు ఉపయోగించుకుంటారన్న అంచనాలు వెలువడ్డాయి.

ఈ అంకెలు బుధవారం రాత్రి 11 గంటలకు..
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు: 14,85,535
మరణాలు                             :   87,291
కోలుకున్న వారు                    :   3,18,875

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top