జిన్‌పింగ్‌ అంటే మోదీకి జంకు

Weak PM Modi is scared of Xi Jinping - Sakshi

ప్రధానిపై రాహుల్‌ విమర్శలు

కేరళలో ఎన్నికల ప్రచారం

న్యూఢిల్లీ/త్రిసూర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలహీనమైన వ్యక్తి అని, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ)లో చైనా వరుసగా నాలుగోసారి అడ్డుతగిలిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘బలహీనమైన మోదీ షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారు. భారత ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటే.. మోదీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు.

చైనాతో నమో దౌత్య సంబంధం ఎలా ఉంటుందంటే.. 1.మోదీ జిన్‌పింగ్‌తో కలసి గుజరాత్‌లో పర్యటిస్తారు. 2.ఢిల్లీలో జీని కౌగిలించుకుంటారు. 3. చైనాలో జీ ముందు తలవంచుతారు’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చేస్తున్న మన ప్రయత్నాలకు చైనా అడ్డుపడుతోంది. ఇక ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కలిసి తిరగడం వల్ల ఒరిగింది ఏంటన్న ప్రశ్న ప్రతి భారతీయుడిలోనూ మెదులుతోంది’’ అని పోస్ట్‌ చేసింది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో తీవ్రమైన జాతీయవాద వాతావరణాన్ని సృష్టించి మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాల నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడింది.

వారికి హింసే ఆయుధం..
బీజేపీ, సీపీఎంలు హింసను ఆయుధంగా వాడుకుంటున్నాయని రాహుల్‌ ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం సైద్ధాంతిక యుద్ధం జరుగుతోందని అన్నారు. కేరళలోని కోజికోడ్‌లో గురువారం నిర్వహించిన ప్రచార ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. అన్ని మతాల ప్రజలు కలసిమెలసి జీవిస్తున్న రాష్ట్రానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెడుతూ..ప్రధాని విధి తన మనసులో ఉన్నది చెప్పడం కాదని, ఇతరుల మనసుల్లో ఏముందో వినడమని హితవు పలికారు. కాంగ్రెస్‌ ఏదో ఒక వ్యక్తి, సంస్థ తరుఫున గళమెత్తదని, దేశమంతటికీ గొంతుక అని అన్నారు. దేనినీ కాంగ్రెస్‌ బలవంతంగా దేశంపై రుద్దదని, ప్రజల అభిప్రాయాలు గౌరవించి దానికి అనుగుణంగా నడుచుకుంటుందని తెలిపారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top