బిడ్డ ఆకలి తీర్చడానికి 911కు కాల్‌ చేసింది!

US Mother Dials 911 Seeking Milk For Her Newborn Baby - Sakshi

వాషింగ్టన్‌ : శాంతి భద్రతలు, పౌరులకు మెరుగైన రక్షణ, క్విక్‌ రెస్పాన్స్‌ విషయంలో అమెరికా పోలీసులు వహ్వా అనిపించారు. అర్ధరాత్రి సమయంలో ఓ మహిళ విన్నపాన్ని మన్నించి.. ఆమె బుజ్జి పాపాయికి పాలు, బేబీ ఫార్ములా తీసుకెళ్లి అందించారు. అమెరికాలో ఎమర్సెన్సీ నెంబర్‌ 911. ఆపత్కాలంలో ఈ నెంబర్‌కు డయల్‌ చేసి పోలీసుల సాయంతో బయటపడొచ్చు. యూఎస్‌లోని ఉత రాష్ట్రానికి చెందిన షానన్‌ బర్డ్‌కు జనవరి 28, అర్ధరాత్రి 2 గంటల సమయంలో తలెత్తిన పరిస్థితి కూడా అలాంటిదే.

స్పందన కరువైంది..!
నెలల తన బుజ్జి పాపాయికి బ్రెస్ట్‌ ఫీడ్‌ చేద్దామంటే షానన్‌ దగ్గర పాలు లేవు. ఇంట్లో ఉన్న పాలు కూడా అయిపోయాయి. పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లిన భర్త కూడా ఆ సమయంలో అందుబాటులో లేడు. సమయమేమో అర్ధరాత్రి రెండవుతోంది. తన మిగతా పిల్లలు (నలుగురు) నిద్రిస్తూ ఉన్నారు. ఇక ఇరుగుపొరుగు వారి సాయం అడుగుదామంటే ఎవరూ స్పందించలేదు. అప్పటికే తన చిన్నారి కూతురు ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తోంది. దాంతో, షానన్‌కు ఏం చేయాలో పాలు పోలేదు. ఇలా కాసేపు మానసిక వేదనకు గురైన ఆమెకు ఆపత్కాలంలో ఆదుకునే 911 గుర్తుకు వచ్చింది. వెంటనే  911కు కాల్‌ చేసి.. తన పరిస్థితిని పోలీసులకు విన్నవించింది. 

స్పందించిన లోన్‌ పీక్‌ ప్రాంత పోలీసులు ఓ పాల డబ్బా, బేబీ ఫార్ములాను తీసుకెళ్లి ఇచ్చారు. పోలీసుల సాయానికి కృతజ్ఞతలు తెలిపిన షానన్‌ తన బ్లాగులో ఈ వివరాలు వెల్లడించింది. ఇక అమెరికన్‌ పోలీసుల ఔదార్యం, షానన్‌ తెలివైన పనిపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. చిన్నారి ఆకలి తీర్చిన పోలీసులు సంతోష పడి ఉంటారని కొందరు, ‘మనసు’పెట్టి పనిచేసిన పోలీసులకు సెల్యూట్‌ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కష్టకాలంలోనూ బిడ్డ ఆకలి తీర్చగలిగిన అమ్మకు సలాం అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top