14.8 లీటర్ల అమ్మపాలు.. నేలపాలు! | Sakshi
Sakshi News home page

14.8 లీటర్ల అమ్మపాలు.. నేలపాలు!

Published Mon, Apr 25 2016 1:52 PM

14.8 లీటర్ల అమ్మపాలు.. నేలపాలు!

పిల్లలకు అమ్మపాలను మించిన అమృతం లేదు. అలాంటి అమృతతుల్యమైన పాలను లండన్‌లోని హీత్రూ విమానాశ్రయ అధికారులు వృథాగా పారబోయడంపై ఓ మాతృమూర్తి ఆవేదన వ్యక్తం చేసింది. 8 నెలల తన చంటిబిడ్డ కోసం తీసుకెళుతున్న 14.8 లీటర్ల అమ్మపాలను నిబంధనలు అనుమతించవంటూ విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ పాలను పారబోసిన తర్వాతే ఆమెను విమానం ఎక్కేందుకు అనుమతించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత మహిళ అమెరికాకు చెందిన జెస్సికా కోక్లే మార్టినెజ్‌ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. హీత్రూ విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఈ పోస్టులో ఆమె వివరించింది.

తన 8 నెలల బిడ్డ కోసం అమ్మపాలు తీసుకొని వెళ్లకుండా అడ్డుకొని.. ఎయిర్‌పోర్టు సిబ్బంది తనను అవమానించారని, 8 నెలల తన పసిబిడ్డ రెండు వారాల ఆహారాన్ని దూరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హీత్రూ విమానాశ్రయం మాత్రం లండన్‌లోని నిబంధనల ప్రకారం ద్రవపదార్థాలు విమానంలో తీసుకువెళ్లడానికి అనుమతి లేదని, అత్యవసరమైన ద్రవపదార్థాలు మాత్రమే 100 ఎంఎల్‌కు మించకుండా తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని చెబుతున్నారు. బిడ్డ వెంట ఉంటేనే తల్లిపాలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇస్తారని వివరణ ఇచ్చారు. అయితే, తాను ప్రయాణిస్తున్న సమయంలో తన చంటిబిడ్డ వెంటలేదని, అయినా అమ్మపాల విషయంలోనూ ఇంత కఠినంగా వ్యవహరించడం సమంజసం కాదని, ఉద్యోగం చేస్తూ పిల్లల ఆలనాపాలనా చూసే తనలాంటి తల్లులకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఆమె కోరుతున్నది.

Advertisement

తప్పక చదవండి

Advertisement