
న్యూయార్క్ : ఓ ప్రయాణీకుడి చేష్టలకు గాల్లో ఎగురుతున్న విమానాన్ని అనూహ్యంగా దించివేశారు. అనంతరం అందులోని ప్రయాణీకులందరిని దింపేసి వారికి హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేసి విమానాన్ని శుభ్రం చేశారు. అనంతరం ఆలస్యంగా బయలుదేరి ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేర్చారు. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన విమానం 895 చికాగో నుంచి హాంకాంగ్ బయలుదేరింది. అయితే, ప్రయాణం మధ్యలో ఉండగా అందులోని ఓ ప్రయాణీకుడి టాయిలెట్‌కు వెళ్లాడు.
అనంతరం విచిత్రంగా ప్రవర్తిస్తూ మలాన్ని విమానం మొత్తానికి పూయడమే కాకుండా అందులోని ప్రయాణీకులకు కూడా అంటించాడు. దాంతో విమానంలో ఓ చెప్పవీలుకానీ పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో పాలుపోక ప్రయాణీకులు గందరగోళానికి గురవుతుండగా అప్పటికప్పుడు అలస్కాలో విమానాన్ని దించివేశారు. అందులో వారందరిని ఎయిర్‌పోర్ట్‌లోని హోటల్స్‌కు తరలించి అనంతరం విమానం మొత్తం శుభ్రం చేయించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ ఆ ప్రయాణీకుడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని అయితే అతడు ఎందుకు విమానంలో అలా చేశాడో అని తెలుసుకునేందుకు మానసిక వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. దీనిపై ఎఫ్‌బీఐ అధికారులు కూడా విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.