పోలీసులను పరుగులు పెట్టించిన యువతులు

UAE youth missing in Mumbai, found in Hyderabad - Sakshi

ఈ నెల 5న విమానంలో ముంబైకి రాక

 ఆ తర్వాత లభించని ఆ నలుగురి ఆచూకీ

తల్లిదండ్రుల ఫిర్యాదులో రంగంలోకి కాన్సులేట్‌

యువతుల్ని సిటీలో గుర్తించిన ముంబై పోలీసులు

సహకరించిన నగర సీసీఎస్‌ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో విహారయాత్రకు వచ్చిన నలుగురు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) యువతులు ముంబైతో పాటు సిటీ పోలీసుల్నీ పరుగులు పెట్టించారు. వారం రోజుల క్రితం ముంబైలో అదృశ్యమైన వారి ఆచూకీ కోసం ఏకంగా యూఏఈ కాన్సులేట్‌ రంగంలోకి దిగింది. దీంతో ఉరుకులు పరుగులు పెట్టిన ముంబై పోలీసులు ఇమ్మిగ్రేషన్‌ అధికారుల సాయంలో హైదరాబాద్‌ లింకు సంపాదించారు. సోమవారం సిటీకి వచ్చిన ముంబై పోలీసు టీమ్‌ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారుల సాయంతో నలుగురి ఆచూకీ కనిపెట్టగలిగారు. దీంతో ఊపిరి పీల్చుకున్న ముంబై పోలీసులు కాన్సులేట్‌ ముందు హాజరుపరచడానికి నలుగురినీ తీసుకుని వెళ్ళారు.

నగరంలోని పాతబస్తీలో ఉన్న మిష్రీగంజ్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు కొన్నేళ్ళ క్రితం దుబాయ్‌కు వలసవెళ్ళారు. అక్కడే దుబాయ్‌ షేక్‌ల్ని వివాహం చేసుకుని స్థిరపడ్డారు. వీరికి జన్మించిన ఇద్దరు యువతులకు యూఏఈ పౌరసత్వం వచ్చింది. ప్రస్తుతం దాదాపు 18 ఏళ్ళ వయస్సులో ఉన్న వీరిద్దరితో పాటు వీరి స్నేహితులైన మరో ఇద్దరూ విహారయాత్ర కోసం భారత్‌కు బయలుదేరారు. గత మంగళవారం ముంబైలో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆపై వీరు తల్లిదండ్రులతో టచ్‌లో లేకుండా పోయారు.

రెండు రోజుల పాటు ఎదురు చూసిన తల్లిదండ్రులు ఆచూకీ లేకపోవడంతో తీవ్రంగా ఆందోళనకు లోనయ్యారు. విషయాన్ని యూఏఈ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడంతో వారు ముంబైలో ఉన్న యూఏఈ కాన్సులేట్‌ను అప్రమత్తం చేశారు. దుబాయ్‌ నుంచి సమాచారం అందడంతో రంగంలో దిగిన కాన్సులేట్‌ అధికారులు నలుగురు యువతుల ఆచూకీ కనిపెట్టాల్సిందిగా కోరుతూ ముంబై పోలీసు కమిషనర్‌ దత్త పద్సాల్గికర్‌కు అధికారిక పత్రం అందించారు. మరోపక్క యూఏఈ కాన్సులేట్‌ నుంచి సమాచారం అందుకున్న విదేశీ వ్యవహారాలు మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖల అధికారులూ ముంబై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ముంబై పోలీసు కమిషనర్‌ వివిధ కోణాల్లో దర్యాప్తు చేయించారు. మూడు రోజుల పాటు అక్కడి అనేక ప్రాంతాల్లో గాలించినా ఫలితం దక్కలేదు. అయితే ప్రత్యేక బృందం శనివారం ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్‌ అధికారుల్ని కలిసి ఈ యువతుల విషయం ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే వారు ఇమ్మిగ్రేషన్‌ చెక్‌లో భాగంగా తాము నలుగురం హైదరాబాద్‌లోని హుస్సేనిఆలంలో ఉంటున్న ఇరువురి బంధువుల వద్దకు వెళ్తున్నట్లు నమోదు చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్న ముంబై పోలీసులు సీసీఎస్‌ పోలీసుల సహాయం కోరారు.

సోమవారం ఉదయం సీసీఎస్‌ స్పెషల్‌ టీమ్స్‌ సాయంతో పాతబస్తీకి వెళ్ళిన ముంబై పోలీసులు అక్కడి హుస్సేని ఆలంలో ఉన్న యువతుల బంధువుల ఇల్లు గుర్తించారు. యూఏఈకి చెందిన నలుగురూ అక్కడే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అదృశ్యంపై ముంబై పోలీసులు నలుగురు యువతుల్నీ ప్రశ్నించారు. తాము అదృశ్యం కాలేదని, యూఏఈలో తీసుకున్న తన సెల్‌ఫోన్‌ సిమ్‌కార్డులకు ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొత్త సిమ్‌కార్డులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, దానికి కొంత సమయం పట్టడంతోనే తల్లిదండ్రుల్ని సంప్రదించలేకపోయామని వివరించారు. ఈ నలుగురినీ ముంబై తీసుకువెళ్ళిన పోలీసులు అక్కడి కాన్సులేట్‌ అధికారులు ముందు హాజరుపరచనున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top