ట్రంప్‌–కిమ్‌ ఒప్పందం ఏయే అంశాలపై ? | Sakshi
Sakshi News home page

Published Sat, May 12 2018 11:10 PM

Trump, Kim Would Discuss About Nuclear Weapons On June 12 - Sakshi

వచ్చే నెల 12న సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భేటీలో కుదిరే ఒప్పందంపై రెండు దేశాలకు అవగాహన ఉందని తెలుస్తోంది. ఉత్తర కొరియా అణ్వాయుధాల కార్యక్రమంపై ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఇరు దేశాలకు మధ్య స్పష్టత ఏర్పడిందని శుక్రవారం అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మాటలు సూచిస్తున్నాయి. సింగపూర్‌ శిఖరాగ్ర సమావేశం అంతిమ లక్ష్యాలపై రెండు దేశాలూ సంపూర్ణ అంగీకారంతో ఉన్నాయని ఆయన చెప్పారు. ఉత్తర కొరియాతో ఏ ఒప్పందం కుదిరినాగాని తర్వాత ఆ దేశంలోని అణ్వాయుధాలు ఎన్ని ఉన్నాయో కట్టుదిట్టంగా లెక్కగట్టే తనిఖీ కార్యక్రమం ఉండాలని అమెరికా భావిస్తోంది.

అప్పుడే తన అణు కార్యక్రమానికి ముగింపు పలకడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నట్టు తేలుతుందని కూడా అగ్రరాజ్యం చెబుతోంది. ఇద్దరు నేతల చర్చల ఫలితంపై ఉభయపక్షాలూ పూర్తి అవగాహనతో ఉండడం అత్యంత కీలకాంశంగా భావిస్తున్నారు. కిందటి నెలాఖరులో ట్రంప్‌ ట్విటర్‌లో కోరినట్టే అణ్వాయుధాలు తొలగిం‍చడానికి ఉత్తర కొరియా సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. అయితే, తమ భూభాగం నుంచి అణ్వాస్త్రాల తొలగింపు అనే మాటలను అమెరికా, ఉత్తర కొరియా భిన్న అర్థాలతో వాడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

దక్షిణ కొరియాలో మోహరించి ఉన్న 28,500 మంది సైనికులను అమెరికా ఉపసంహరించుకుంటే తన అణ్వాయుధాలను వదులుకోవడానికి సిద్ధమని సింగపూర్‌ భేటీ ప్రతిపాదనకు ముందు ఎప్పటి నుంచో ఉత్తర కొరియా చెబుతోంది. కాని, ఉత్తర కొరియా అణ్వాయుధాల తొలగింపునకు ఇలాంటి షరతు పెడితే అంగీకరించడానికి అమెరికా, దక్షిణ కొరియా సిద్దంగా లేవు. ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమానికి పూర్తిగా స్వస్తి పలకాలని అవి కోరుకుంటున్నాయి. 

అణ్వాయుధాల తొలగింపునకు ’టైంటేబుల్‌’
తన అణ్వాయుధాలు తొలగించడానికి, తనిఖీదారులొచ్చి ఆయుధాలు లెక్కించడానికి ఉత్తర కొరియా ఓ సమయ ప్రణాళికకు అంగీకరించవచ్చని ఈ చర్చల వ్యవహారంతో సంబంధం ఉన్న అమెరికా ఉన్నతాధికారి వెల్లడించారు. ’’ ఆయుధాల తనిఖీదారులు మొదట ఉత్తర కొరియా ఆణుపాటవంపై నివేదిక రూపొందిస్తారు. ఆయుధాలెన్నో లెక్కగడతారు. తర్వాత కొన్ని అణ్వాయుధాలను ఉత్తర కొరియా తొలగించాక, అమెరికా కొన్ని ఆంక్షలు ఎత్తేస్తుంది. మరి కొన్ని అణుబాంబులను ధ్వంసం చేశాక ఉత్తర కొరియాకు మరిన్ని రాయితీలు ప్రకటిస్తారు. తర్వాత దశలో అణు రియాక్టర్లను ఉత్తర కొరియా మూసేస్తుంది. అవి పనిచేయడం ఆగిపోతుంది. వెంటనే ఉత్తర కొరియాకు అమెరికా నుంచి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

ఇలా దశవారీగా కిమ్‌ తన దేశ అణ్వాయుధ కార్యక్రమానికి ముగింపు పలికే విధంగా ఇద్దరు నేతల మధ్య ఒప్పందం కుదురుతుంది,’’ అని ఈ దౌత్యాధికారి వివరించారు. అయితే, సింగపూర్‌లో కుదిరే ఒప్పందం వివరాలు వెల్లడించడానికి అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నిరాకరించారు. ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపేయడానికి అన్ని చర్యలు తీసుకునేలా ఈ దేశంపై గరిష్ట స్థాయిలో ఒత్తిడి కొనసాగుతుందని అమెరికా స్పష్టంచేసింది. ట్రంప్, కిమ్‌ భేటీ జరగడానికి నెల రోజుల సమయం ఉన్న కారణంగా ఈ లోగా రెండు దేశాల ఆలోచనల్లో మార్పులొచ్చే అవకాశాలు లేకపోలేదు. 

ఒప్పందం కుదరకపోయే అవకాశమూ ఉంది!
సింగపూర్‌లో ట్రంప్, కిమ్‌ కలిశాక ఏం జరగవచ్చనే విషయంలో రకరకాల ఊహాగానాలు సాగున్నాయి. మొదట నేతలిద్దరూ కలిసి కరచాలనం చేసి ఎవరి దారిన వారు వెళ్లిపోవచ్చు. సంప్రదింపుల తర్వాత సంతకాలు చేసిన ఒప్పందం తమకు మేలు చేసేదిగా లేదంటూ కిమ్‌ దాన్ని అమలు చేయకుండా బుట్టదాఖలు చేసే ప్రమాదం కూడా ఉందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 1950ల నుంచీ కొరియా ద్వీపకల్పంలో పరిణామాలు గమనిస్తే ఉత్తర కొరియాను ఒప్పించి ఒడంబడిక చేసుకోవడం చాలా కష్టమైన పని. ఒప్పందాలను అలవోకగా ఉల్లంఘించడం  ఈ కొరియా నేతలకు కొట్టిన పిండి.

ఉత్తర కొరియా అణుకార్యక్రమంపై ఆ దేశ పాలకులతో సంప్రదింపులు జరిపి ఒప్పందానికి రావడానికి 1985 నుంచీ అమెరికా ప్రయత్నిస్తూనే ఉంది. కమ్యూనిస్ట్‌ కొరియా నేతలు అనేకసార్లు తమ మాట నిలబెట్టుకోలేదు. అణ్వాయుధాల తొలగింపుపై అమెరికాతో 2009లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా ఉత్తర కొరియా గాలికి వదిలేసింది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ సమావేశంలో ఏఏ అంశాలు చర్చించాలనే విషయంపైనే రెండు దేశాలకు అవగాహన కుదిరి ఉండవచ్చుగాని అసలు ఒప్పందంలోని అంశాల ప్రస్తావన జరిగి ఉండకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 
-(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
 


 

Advertisement

తప్పక చదవండి

Advertisement