మన చర్మం ముడుతలు పడకుండా వయసు పెరిగినా యవ్వనంలోనే ఉన్నట్లు నిగనిగలాడుతుంటే చాలా బాగుంటుంది కదూ.
న్యూయార్క్: మన చర్మం ముడుతలు పడకుండా వయసు పెరిగినా యవ్వనంలోనే ఉన్నట్లు నిగనిగలాడుతుంటే చాలా బాగుంటుంది కదూ. ఇది భవిష్యత్తులో సాధ్యం కానుంది. చర్మం ముడుతలు పడకుండా దానిని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడే ఓ యాంటీఆక్సిడెంట్ రసాయనాన్ని తాము కనుగొన్నామని న్యూక్యాజిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘టిరాన్’ అనే ఈ యాంటీఆక్సిడెంట్ రసాయనం సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి వంద శాతం రక్షణ కల్పిస్తుందని, చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా ఉంచేందుకు తోడ్పడుతుందని వారు తెలిపారు. ఇలాంటి వాటిని ఆహారం, సౌందర్యసాధనాల్లో చేర్చి ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.
అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రెడ్‌వైన్‌లో ఉండే రెస్‌వెరట్రాల్ 22శాతం, ల్యాబ్‌లలో వాడే నాక్ 20శాతం, పసుపులో ఉండే కుర్‌కుమిన్ 16శాతం రక్షణ కల్పిస్తుండగా.. టిరాన్ మాత్రం 100 శాతం రక్షిస్తుందని తేలడం విశేషం.