
తాబేలు పొట్టలో 915 నాణేలు
సముద్రపు తాబేలు పొట్టలో 915 నాణేలు బయటపడ్డాయి.
బ్యాంకాక్: సముద్రపు తాబేలు పొట్టలో 915 నాణేలు బయటపడ్డాయి. బ్యాంకాక్‌లోని శ్రీరకా కన్జర్వేషన్ సెంటర్‌లో తాబేలు నివసించే ట్యాంక్‌లో సందర్శకులు వందల సంఖ్యలో కాయిన్లు విసేరేసేవారు. వాటిలో కొన్నింటిని అందులో నివాసముండే ఒమ్సిన్ అనే సముద్రపు పచ్చతాబేలు మింగేసింది. కాలక్రమేణా ఎక్కువ సంఖ్యలో నాణేలను మింగడంతో ఈదలేని పరిస్ధితికి చేరుకుంది.
ఒమ్సిన్ అవస్ధను గుర్తించిన కన్జర్వేషన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి తాబేలు పొట్టలోని నాణేలు బయటకు తీయకపోతే దాని ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు తెలిపారు. దీంతో ఒమ్సిన్‌కి ఆపరేషన్ నిర్వహించగా.. దాని పొట్టలో చుట్టబడిపోయిన 5 కేజీల నాణేల బాల్ ఉంది. దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి తాబేలును వైద్యులు రక్షించారు.
ప్రపంచంలో తొలిసారి ఇలాంటి ఆపరేషన్‌ను నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఒమ్సిన్ పూర్తిగా కోలుకోవడానికి ఒక నెల సమయం పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మరో ఆర్నెల్ల పాటు ఫిజికల్ థెరపీ అవసరమని తెలిపారు.