సహాయ టీమ్‌లు వెళ్లిపోవాలి | Teams go for help nepal government fire | Sakshi
Sakshi News home page

సహాయ టీమ్‌లు వెళ్లిపోవాలి

May 5 2015 1:55 AM | Updated on Sep 3 2017 1:25 AM

భూకంప బాధిత నేపాల్‌లో సహాయక(రెస్క్యూ) కార్యక్రమాలు చేపడుతున్న భారత్ సహా 34 దేశాల బృందాలు వెళ్లిపోవాలని ఆ దేశ ప్రభుత్వం సోమవారం కోరింది.

విదేశాలకు నేపాల్
ప్రభుత్వం విజ్ఞప్తి
భూకంప మృతులు 7,365

 
కఠ్మాండు: భూకంప బాధిత నేపాల్‌లో సహాయక(రెస్క్యూ) కార్యక్రమాలు చేపడుతున్న భారత్ సహా 34 దేశాల బృందాలు వెళ్లిపోవాలని ఆ దేశ ప్రభుత్వం సోమవారం కోరింది. బాధితుల కోసం భారీస్థాయిలో పునరావాస కార్యక్రమాలు ప్రారంభించడానికి సిద్ధమై ఈమేరకు విజ్ఞప్తి చేసింది. నేపాల్‌కు భారత్ సాయాన్ని భారత్ మీడియాలో గొప్పగా చూపుతుండడంపై సామాజిక వెబ్‌సైట్లలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో పైవిధంగా స్పందించింది.


అయితే భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకోలేదని, అన్ని దేశాలను కోరినట్లే ఆ దేశాన్నీ కోరామని భారత్‌లోని నేపాల్ రాయబారి దీప్‌కుమార్  చెప్పారు. పునరావాసంపై దృష్టి పెడుతున్నామని, విదేశాలు సహాయక బృందాలను ఉపసంహరించుకోవాలని నేపాల్ విదేశాంగ శాఖ కోరింది. శిథిలాల కింద చిక్కుకున్నవారు జీవించి ఉండే అవకాశం లేదు కనుక విదేశీ బృందాలను వెళ్లాలని నేపాల్ చెప్పిందని భారత జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్‌ఎఫ్) చీఫ్ ఓపీ సింగ్ చెప్పారు. తమ బృందాల ఉపసంహరణ ప్రారంభించామన్నారు.


నేపాల్‌లో సోమవారం కూడా ఏడు స్వల్పస్థాయి భూప్రకంపనలు సంభవించాయి. సింధుపాల్‌చౌక్‌లో వచ్చిన ఒకదాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది.  గత నెల 25 నాటి భారీ భూకంపంలో చనిపోయిన వారి సంఖ్య 7,365కు చేరింది. మృతుల్లో 41 మంది భారతీయులు ఉన్నారు. బాధితులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించడానికి పది లక్షల టెంట్లు అవసరమని నేపాల్ ఉప ప్రధాని ప్రకాశ్ మాన్ సింగ్ తెలిపారు. ఎవరెస్ట్  వద్ద మంచుచరియలు విరిగిపడ్డంతో ప్రస్తుత సీజన్‌లో పర్వతారోహణను నేపాల్ ప్రభుత్వం ముగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement