పాకిస్తాన్‌లో సిక్కు యువకుడి దారుణ హత్య..!

Sikh Man Murdered In Pakistan After Nankana Sahib Attack - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లోని చారిత్రక నాన్‌కానా సాహిబ్‌ గురుద్వారపై దాడి ఘటనను మరువకముందే సిక్కు వర్గానికి చెందిన ఓ యువకుడు పెషావర్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. రవిందర్‌ సింగ్‌ (25) హత్యకు గురయ్యాడని, నిందితులను అదుపులోకి తీసుకున్నామని అక్కడి పోలీసులు తెలిపారు. ఖైబర్‌-పక్తుంక్వా ప్రాంతానికి చెందిన రవిందర్‌ మలేషియాలో నివాసముండేవాడు. వివాహం చేసుకునేందుకు పాకిస్తాన్‌కు వచ్చిన రవిందర్‌ హత్యకు గురవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కాగా, మృతుడు పాక్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో తొలి సిక్కు జర్నలిస్టుగా గుర్తింపు పొందిన హర్మీత్‌సింగ్‌ సోదరుడు కావడం గమనార్హం.
(చదవండి : పాక్‌లో గురుద్వారాపై దాడి.. పలువురి ఖండన)

ఇక ఈ హత్యోదంతంపై భారత్‌ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పాక్‌లోని సిక్కులకు, గురుద్వారలకు రక్షణ కరువైందని బీజేపీ నేతలు మండిపడ్డారు. రవిందర్‌ను హతమార్చిన దోషుల్ని కఠినంగా శిక్షంచాలని భారత విదేశాంగ శాఖ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను డిమాండ్‌ చేసింది. ఇదిలాఉండగా..నాన్‌కానా సాహిబ్‌ గురుద్వార వద్ద జరిగేది ఒకటైతే.. బయట ప్రచారం వేరేలా ఉందని ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు పొరుగు దేశాల్లో అణచివేతకు గురౌతున్న మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ తీసుకొచ్చామని కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి చెప్పారు. కాగా, 2014 డిసెంబర్‌ 31కి ముందు భారత్‌కు వచ్చిన ఆరు ముస్లిమేతర వర్గాల ప్రజలకు సీఏఏ భారత పౌరసత్వం కల్పించనుంది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top