నెట్టింట్లో ఇవాంకా హల్‌చల్‌

setairs on ivanka trump's hyderabad trip in social media - Sakshi - Sakshi

అమెరికా అధ్యక్షుని గారాలపట్టికి ఆన్‌లైన్‌ స్వాగతాలు, సెటైర్లు

తెలుగు రాష్ట్రాల్లోని స్మార్ట్‌ ఫోన్ల నిండా ఆమె చిత్రాలు, విశేషాలే

మా ఊరికి రావాలంటే.. మా ఊరికి రావాలని ఆహ్వానాలు

ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో చర్చోపచర్చలు

సాక్షి, హైదరాబాద్‌: ఇవాంకా ట్రంప్‌.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఈ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)కు ఆమె హాజరుకానుండడంతో గత పదిరోజులుగా ఇవాంకా పేరు చర్చనీయాంశమవుతోంది. అందం, ఆకర్షణ కలిగి ఉండడంతో పాటు అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుని గారాలపట్టి కావడంతో ఆ నోటా.. ఈ నోటా.. ఏ నోట విన్నా ఇవాంకా ట్రంప్‌ పేరే వినిపిస్తోంది. పత్రికలు, మీడియా ఆమె పర్యటన విశేషాలను, వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తున్న నేపథ్యంలో ఇవాంకా గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 

ముఖ్యంగా నెట్టింట్లో ఇవాంకా హల్‌చల్‌ చేస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఇవాంకా రాక గురించి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రావమ్మా ఇవాంకా.. అంటూ ఆమెను భాగ్యనగరికి కొందరు ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తుండగా, మరికొందరు ఆమె పర్యటనపై సెటైర్లు వేస్తున్నారు. ఇవాంకా రాకపోకలు సాగించే మార్గాలను సుందరీకరిస్తుండడం, రోడ్లు బాగుచేయిస్తుండడం, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఆమె బస చేసే వెస్టిన్‌ హోటల్‌ వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుండడంపై ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు. 

రాజధానిలో బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించే కార్యక్రమం, వీధికుక్కలను నియంత్రించే ప్రయత్నాల గురించి అయితే ఛలోక్తులు, విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇవాంకా విందు చేసే ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని భారీ టేబుల్‌ గురించి, ఆమె తినే వంటకాల గురించి, ప్రయాణించే వాహనాల గురించి, ఆమె భద్రత గురించి గత వారం రోజులుగా చిత్ర విచిత్ర చర్చలు జరుగుతున్నాయి. ‘శతాబ్దాల రాతియుగపు సమాధుల నుంచి’ అంటూ ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ కవిత వైరల్‌ అయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని స్మార్ట్‌ఫోన్ల నిండా ఇవాంకా చిత్రాలు, విశేషాలే కనిపిస్తున్నాయి.

ఈ వంక రావమ్మా... ఇవాంకా!
ఇవాంకా మా ఊరికి రావాలంటే మా ఊరికి రావాలని కొందరు చేస్తున్న ఆన్‌లైన్‌ ఆహ్వానాలు నవ్వు తెప్పిస్తున్నాయి. వరంగల్‌కు వస్తే ఓరుగల్లు కోట చూపెడతామని, కల్లు తాపుతామని అభిమానంతో ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టింగ్‌కు తండోపతండాలుగా లైకులు, కామెంట్లు వచ్చాయంటే ఆమె పర్యటనపై ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని మణికొండకు రావాలంటూ ఇవాంకా ట్రంప్‌తో వాట్సాప్‌లో డిస్కస్‌ చేసినట్టు, ఆమె అందుకు అంగీకరించినట్టు వచ్చిన మరో వీడియో కూడా అంతే వైరల్‌ అయింది. ఇవాంకా ఏ వంక ప్రయాణించాలన్నా సీఐఏ డేగకళ్ల అనుమతి ఉండాలని తెలిసినా ఆమె వస్తే మా ప్రాంతం బాగుపడుతుందేమోననే కోణంలో చేస్తున్న ఆహ్వానాలు, ఇవాంకా ఆతిథ్యం కోసం హైదరాబాద్‌లో చేస్తున్న ఏర్పాట్లపై వస్తున్న సెటైర్లు గత వారం రోజులుగా తెలుగు ప్రజలకు కనువిందు చేస్తున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top