ఆరో వినాశనం.. ఇలా ఆపేద్దాం!

Saving the planet may cost USD 100 billion per year - Sakshi

భూపరిరక్షణకు ఏటా 7 లక్షల కోట్లు అవసరం

జీడీఎన్‌ పేరిట పాలసీని రూపొందించిన 19 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: భూమి చరిత్రలో ఆరో వినాశనం త్వరలోనే ఉండనుందా..? ఇప్పటివరకు ఐదు సమూహ వినాశనాలతో తల్లడిల్లిన భూమికి ఆరో వినాశనం తప్పదా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న ఆ ఆరో వినాశనానికి మూల కారకులు మానవులేనని కూడా చెబుతున్నారు. భూమిపై జీవ వైవిధ్యాన్ని, సమతుల్యతను కాపాడి ఆరో వినాశనాన్ని తప్పించేందుకు రూపొందించిన ఓ విధానం అమలుకు ఏడాదికి రూ.7 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆయన వెల్లడించారు.

ఇది కూడా ఎంత వీలైతే అంత త్వరగా చేపట్టాలని, తద్వారా మానవ నిర్మిత జీవవైవిధ్యం ద్వారా జరిగే విధ్వంసాన్ని ఈ దశాబ్దంలోనే అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు. ఆరో వినాశనం మానవుడి భుజస్కందాలపై ఉందని, ఏం చేయాలో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అమెరికాలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన ఎకాలజిస్ట్‌ గ్రెగ్‌ అస్నర్‌ తెలిపారు. భూమిపై జీవవైవిధ్యాన్ని, సమృద్ధిని కాపాడటానికి ‘ఏ గ్లోబల్‌ డీల్‌ ఫర్‌ నేచర్‌(జీడీఎన్‌)’అనే సైన్స్‌ పాలసీని రూపొందించిన 19 మంది అంతర్జాతీయ పరిశోధకుల్లో అస్నర్‌ ఒకరు. ఈ ఖర్చు అంత భారీదేమీ కాదని, అమెరికాలోని యాపిల్, బెర్క్‌షైర్‌ హాత్వే కంపెనీలు 2018లో ఆర్జించిన లాభాలతో ఇది సమానమన్నారు.  

రెండో అతిపెద్ద నిర్ణయం..
భూ వినాశనాన్ని అడ్డుకునేందుకు తీసుకున్న నిర్ణయాల్లో జీడీఎన్‌ రెండో అతిపెద్ద నిర్ణయం కాగా.. మొదటిది 2015లో తీసుకున్న పారిస్‌ ఒప్పందం. ‘అయితే పారిస్‌ ఒప్పందం ఒక్కటే భూమిపై జీవ వైవిధ్యాన్ని, మానవాళికి అవసరమైన పర్యావరణాన్ని సంరక్షించలేదు. దీని కోసం మరొక ప్రత్యామ్నాయం అవసరం. శాస్త్ర ఆధారిత, నిర్ణీత కాల పాలసీ అయిన ది గ్లోబల్‌ డీల్‌ ఫర్‌ నేచర్‌ భూమిపై జీవ వైవిధ్యాన్ని, సమృద్ధిని కాపాడగలదు. భూ వినాశనాన్ని ఆపడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో జీడీఎన్‌ పాలసీకి తిరుగులేదు. భావితరాలకు మనం ఇవ్వబోయే అతిపెద్ద బహుమతి ఈ పాలసీ మాత్రమే. జీడీఎన్‌ పాలసీలో మూడు లక్ష్యాలను నిర్దేశించాం’అని అమెరికాలోని నాన్‌ గవర్నమెంటల్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన ఎరిక్‌ డైనర్‌స్టెయిన్‌ వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం: మోదీ
వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను తగ్గించడంలో దేశ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు ధరిత్రీ దినోత్సవం ఓ సందర్భం అని ప్రధాని మోదీ అన్నారు. ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ..‘భూమాతకు మనం భక్తితో నమస్కరిస్తాం. ఏళ్లుగా అసాధారణ వైవిధ్యాలకు ఈ భూగ్రహం ఓ నిలయం. మన గ్రహం శ్రేయస్సు కోసం స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పులను తగ్గించడంలో మన నిబద్ధతను ఈ రోజున మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం’అని అన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top