బ్రిటీష్‌ దౌత్యవేత్తలను తరిమేస్తాం: రష్యా

Russia will of course banish British diplomats, Lavrov - Sakshi

ఆస్టానా: లండన్‌ నుంచి రష్యాకు చెందిన 23 మంది దౌత్య వేత్తలను లండన్‌ నుంచి తరిమేస్తామన్న బ్రిటన్‌ ప్రభుత్వంపై సరైన నిర్ణయం తీసుకుంటామని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్‌  తెలిపారు.  బ్రిటీష్‌ మాజీ గూఢచారి స్ర్కిపాల్‌పై రష్యా దౌత్యవేత్తలు హత్యాయత్నం చేశారనే ఆరోపణలపై ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటున్నట్టు బ్రిటన్‌ ప్రధాన మంత్రి థెరిసా మే ప్రకటించారు. 

సిరియాలో కొనసాగుతున్న అల్లకల్లోల పరిస్థితులపై ఇరాన్‌, టర్కీ విదేశాంగ మంత్రులతో కలిసి కాజా రాజధాని ఆస్టానాలో గురువారం రష్యా విదేశాంగ మంత్రి  విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బ్రిటన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే తామూ అమలు చేస్తామనీ, బ్రిటన్‌ దౌత్యవేత్తలను రష్యా నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.  

స్ర్కిపాల్‌ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమ దేశానికి లేదని, ఫిఫా ప్రపంచకప్‌-2018 కి ఆతిథ్యం ఇవ్వబోతున్న  రష్యాను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఇంకెవరైనా స్ర్కిపాల్‌పై దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి ముందు రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ.. ఈ వివాదంపై మాస్కో భావాలకు అనుగుణంగానే తమ అధ్యక్షుడు పుతిన్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 

స్ర్కిపాల్‌, అతని కూతురు యులియా పై జరిగిన దాడిని ఖండిస్తూ.. దానిని ‘యూకే సౌభ్రాతృత్వం పై దాడి’గా పేర్కొంటూ బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి. అంతర్జాతీయ స్థాయి కుంభకోణాన్ని మరుగున పరిచేందుకు బ్రిటీష్‌ మాజీ గూఢచారి స్ర్కిపాల్‌, అతని కూతురుపై రసాయనాలతో హత్యాయత్నం జరిగిందని ఆయా దేశాలు ఆరోపించాయి. కాగా మార్చి 4న ఇంగ్లండ్‌లోని సలిస్‌బరిలో స్ర్కిపాల్‌, అతని కూతురుపై రసాయన దాడి జరిగింది.  ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top