భారత్ సురక్షిత దేశం కాదు: రష్యా | Sakshi
Sakshi News home page

భారత్ సురక్షిత దేశం కాదు: రష్యా

Published Sun, Nov 29 2015 4:09 PM

Russia strikes India off its safe travel destinations list

రష్యా  తమ దేశ పౌరులు విహారయాత్రకు వెళ్లే  సురక్షితమైన ప్రాంతాల జాబితా నుంచి భారత్ను తొలగించింది. రష్యా నిర్ణయంతో గోవాలో పర్యాటకంపై ప్రభావం చూపే అవకాశముంది. గోవాలో పర్యటించే విదేశీ టూరిస్టుల్లో ఐదు శాతం మంది రష్యాకు చెందిన వారే. సురక్షితం కాని ప్రాంతాల జాబితాలో ఇండియాను చేర్చడానికి గోవాలో నెలకొన్న స్థానిక పరిస్థితులు ప్రధాన కారణంగా రష్యా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

రష్యన్ రూబుల్ బలహీన పడటంతో టూరిస్టులు చౌకగా ఉండే ప్రాంతాలను ఎన్నుకుంటున్నారనీ.. గోవాలో వసతి, ఇతర సౌకర్యాలకు అధిక ధరలు ఉండటంతో టూరిస్టుల ఆసక్తి తగ్గిందని రష్యా సమాచార అధికారి తెలిపారు. తమ దేశ పర్యాటకులకు మంచి సౌకర్యాలు కల్పించేలా భారత్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకే రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల రష్యా విమానాన్ని టర్కీ కూల్చిన నేపథ్యంలో టర్కీ, ఈజిప్టులను నిషేధిత దేశాలుగా పేర్కొంది. క్యూబా, దక్షిణ వియత్నాం, దక్షిణ చైనాలను టూరిజానికి సురక్షితమైన ప్రాంతాలుగా ప్రకటించింది. ఆసియాలోని వియత్నాం తదితర ప్రాంతాల్లో టూరిజానికి అనువైన, చౌకయిన పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.

 

Advertisement
Advertisement