ఖతార్‌ బిత్తిరి చర్య.. సౌదీ వార్నింగ్‌

Qatar Russia Missile Deal Saudi Threatens Military Action - Sakshi

రియాద్‌‌: ఏడాది క్రితం మొదలైన గల్ఫ్‌ దేశాల మధ్య ముసలం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. శాంతి వాతావరణాన్ని దెబ్బ తీస్తూ రష్యా నుంచి శక్తివంతమైన క్షిపణులను కొనుగోలు చేసేందుకు ఖతార్‌ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి పరిస్థితే గనుక ఉత్పన్నం అయితే సైనిక చర్య తప్పదని ఖతార్‌ను హెచ్చరించింది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సౌదీ రాజు సల్మాన్ ఓ లేఖ రాయగా.. అందులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందన్న ఆరోపణలతో గతేడాది జూన్‌లో సౌదీ అరేబియా సహా బెహ్రయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. గల్ఫ్‌ దేశాల పరస్పర సహకార మండలి(జీసీసీ) దేశాలన్నీ ఖతార్‌పై ఆంక్షలు కూడా విధించాయి. ఒకవేళ ఆంక్షలు తొలగించాలంటే మాత్రం 13 డిమాండ్ల(టర్కీ మిలిటరీ స్థావరాలను ఎత్తివేయటం, అల్‌ జజీరా మీడియా నెట్‌ వర్క్‌ అనుమతుల రద్దు తదితరాలు ఇందులో ఉన్నాయి)తో కూడిన ఒప్పందంపై సంతకం చేయాలన్న నిబంధన విధించాయి. అయితే దోహా(ఖతార్‌ రాజధాని) మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ డిమాండ్లకు నిరాకరించింది.

ఒంటరిగా మారిన ఖతర్ తర్వాత రష్యాతో కొత్తగా స్నేహాన్ని మొదలుపెట్టింది. అంతేకాదు ఆయుధాల కొనుగోలు, దౌత్యపరమైన ఒప్పందాలను కూడా చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో రష్యా నుంచి ఎస్-400 డిఫెన్స్ మిసైల్ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపింది. తాజాగా రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు ఈ డీల్‌ గురించి బహిరంగంగా ప్రస్తావించటంతో సౌదీ అప్రమత్తమైంది. ఒప్పందం కనుక కుదుర్చుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూనే.. మరోవైపు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఫ్రాన్స్‌ను కోరుతోంది. అయితే ఈ లేఖపై ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం స్పందించాల్సి ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top