ఇమ్రాన్ ముందు అనేక‌ సవాళ్లు

Pakistan Prime Minister Imran Khan Facing Multiple Challenges - Sakshi

కరాచీ: పొరుగు దేశం పాకిస్తాన్ ప్ర‌భుత్వం 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం ల‌క్ష్యాల్లో ఏ ఒక్క‌టీ సాధించ‌లేక‌పోయింది. ఐఎమ్ఎఫ్‌, ప్ర‌పంచ బ్యాంకు సంయుక్తంగా  చేప‌ట్టిన స‌ర్వేలో పాక్ జీడీపీలో అప్పు 88 శాతానికి ఎగ‌బాకనుండ‌గా ఆర్థిక వ్యవస్థ 68 ఏళ్ల కనిష్టానికి చేరుకుం‌ది. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక స‌ల‌హాదారు డా. అబ్ధుల్ హ‌ఫీజ్ షేఖ్ పాక్‌ ఆర్థిక స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఇలాంటి దీనావ‌స్థ‌లో ఉన్న పాక్ భార‌త్‌కు న‌గ‌దు బ‌దిలీ సాయం చేస్తానంటూ ముందుకు రాగా.. భార‌త్ తిప్పికొట్టిన‌ సంగ‌తి తెలిసిందే. ఇదిలా వుంటే క‌రోనా కార‌ణంగా 10 మిలియ‌న్ల మంది పాక్ ప్ర‌జ‌లు పేద‌రికంలోకి వెళ్లిపోయారు. (మీరా మాకు సాయం చేసేది)

క‌శ్మీర్‌ను రాజ‌కీయం చేయ‌ని పాక్‌
ఈ నేప‌థ్యంలో తిండిగింజ‌కు ఇబ్బందులు ప‌డే అవ‌కాశ‌మున్నందున ఇమ్రాన్ ఖాన్‌ త‌మ దేశంలో లాక్‌డౌన్ విధించ‌బోనంటూ మార్చిలో ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. ఈ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే పాక్ ఆర్మీ లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో పాక్ ప్ర‌భుత్వం‌, ఆర్మీకి మ‌ధ్య ఉన్న విబేధాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే దేశంలోని తిరుగుబాట్లు, రాజ‌కీయ వివాదాలు, ఆర్థిక లోటుపై ప్ర‌జ‌ల‌ దృష్టి మ‌ర‌ల్చేందుకు పాక్ ఏళ్ల త‌ర‌బ‌డి క‌శ్మీర్ అంశాన్ని ఒక ఆయుధంగా ఉప‌యోగిస్తూ వ‌స్తోంది. కానీ ఏడాది కాలంగా అది క‌శ్మీర్ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోలేదు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇమ్రాన్ ఖాన్ క‌శ్మీర్ అంశాన్ని ప‌క్క‌న పెట్టేశాడు. 

ప్ర‌భుత్వంపై ప‌ట్టు కోల్పోతున్న ఇమ్రాన్ ఖాన్‌
మ‌రోవైపు ఆర్మీ అధికారులే కీలక ప‌ద‌వులు ద‌క్కించుకుంటూ పాక్ ప్ర‌భుత్వంపై పెత్త‌నం కొన‌సాగిస్తున్నారు. క‌రోనా స‌మీక్ష‌లోనూ సైన్యాధికారులే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బ్లూమ్‌బ‌ర్గ్ నివేదిక సైతం పాక్ ప్ర‌భుత్వంపై సైన్యం త‌న ప‌ట్టును బిగిస్తోంద‌ని వెల్ల‌డించింది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఈ స‌వాళ్లే ప్ర‌ధాని ఇమ్రాన్ మౌనానికి కార‌ణ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెండేళ్లుగా ఆయ‌న పాపులారిటీ కూడా త‌గ్గిపోయింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. (మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్‌ పెత్తనం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top