మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్‌ పెత్తనం?

Pakistan PM Imran khan Requests Help Of Pakistan Army - Sakshi

కరాచీ: పొరుగు దేశం పాకిస్థాన్‌లో మళ్లీ మిలటరీ పెత్తనం మొదలైందా? కీలకమైన ప్రభుత్వ విభాగాలకు పలువురు మిలటరీ జనరళ్లు నేతృత్వం వహిస్తూండటం దీన్నే సూచిస్తోందా? అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారిపోతూండటం, పెరిగిపోతున్న ధరలు.. సన్నిహితులే అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటూండటంతో ప్రధాని ఇమ్రాన్‌ మళ్లీ ఆర్మీ సాయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని ఈ క్రమంలోనే జాతీయ విమాన సర్వీసులతోపాటు విద్యుత్తు రెగ్యులేటరీ సంస్థ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లతోపాటు పలు ఇతర విభాగాల్లో ప్రస్తుత, మాజీ మిలటరీ అధికారులను అధ్యక్షులుగా నియమించారని విశ్లేషకులు చెబుతున్నారు.

పాకిస్థాన్‌లో మిలటరీ పెత్తనం కొత్తేమీ కాకపోయినప్పటికీ.. 2018 నాటి ఎన్నికల్లో మిలటరీ ప్రమేయం లేని కొత్త పాకిస్థాన్‌ను ఆవిష్కరిస్తానన్న ప్రచారంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని గద్దెనెక్కడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. పార్లమెంటులో 46 శాతం సీట్లు గెలుచుకున్న ఇమ్రాన్‌ పార్టీ అధికారంలో ఉండేందుకు పలు చిన్న చితక పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా తన ప్రాబల్యం తగ్గినట్లు ప్రధాని ఇమ్రాన్‌ భావిస్తున్నారు. మిలటరీ సాయం ఉంటే అధికారంలో కొనసాగవచ్చునని అంచనా వేస్తున్నారు. మిలటరీ అధికారులకు కీలక పదవులు అప్పగించడం పాకిస్థాన్‌ ప్రభుత్వం విధానాల రూపకల్పన, అమలులో పౌర సమాజం పాత్రను తగ్గిస్తోందని, భవిష్యత్తులోనూ మిలటరీ ప్రాభవం మరింత పెరగనుందని అట్లాంటిక్‌ కౌన్సిల్‌ అనే సంస్థకు చెందిన ప్రవాస పాకిస్థానీ ఉజైర్‌ యూనస్‌ చెబుతున్నారు. కోవిడ్‌ వైరస్‌కు సంబంధించి అధికార టెలివిజన్‌ ఛానెల్‌లో మిలటరీ యునిఫామ్‌లు వేసుకున్న వారు ప్రభుత్వ అధికారులకు సాయం చేస్తూండటం కూడా అధికారం మిలటరీ వైపు మళ్లిపోతోందన్న అంచనాలకు బలం చేకూరుస్తోంది.

ఆర్థిక వ్యవస్థ కుదేలు..
కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోవడం కూడా పాకిస్థాన్‌లో ఆర్మీ పెత్తనం పెరిగేందుకు కారణమని రాజకీయ విశ్లేషకుల అంచనా. దేశవ్యాప్తంగా ఇప్పటికే సుమారు లక్షకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, 2200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ 68 ఏళ్ల కనిష్టానికి చేరుకుందని సెంట్రల్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. మార్చి నెలలో కరోనా ఉధృతంగా ఉన్నప్పుడే ప్రభుత్వంలో మిలటరీ ప్రమేయం పెరుగుతోందన్న ఆరోపణలు రాగా, వాటిని ఇమ్రాన్‌ కొట్టిపారేశారు. అయితే ఆ మరుసటి రోజే ఆర్మీ ప్రతినిధి స్వయంగా లాక్‌డౌన్‌ను ప్రకటించడం, ఆ తరువాత కూడా పలు పత్రికా ప్రకటనలు కూడా ఆర్మీ మీడియా విభాగమే విడుదల చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆర్మీ, మిలటరీ పెత్తనం పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వంపై ఇమ్రాన్‌ పట్టు  తగ్గిపోవడం ఖాయమని న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ విశ్లేషకుడు స్పష్టం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top