మనకు లభించే శుద్ధమైన నీటి వనరులను కాపాడుకోవాలంటే అడవులను కాపాడుకోవడమే ప్రధానమార్గమని దీంతోనే నీటి కొరత ఏర్పడకుండా ఉంటుందని ఐరాసలో జరిగిన నీటి చర్చల్లో భాగంగా ప్యానెల్ అభిప్రాయపడింది.
నీటి కొరతపై ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. అడవుల పరిరక్షణ, మంచినీటి నిర్వహణ, నీటికొరత నివారణ ప్రధాన అంశాలుగా ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో చర్చ నిర్వహించింది. మనం రోజూ వాడుకునే మంచినీటి నిల్వల్లో మూడొంతులు అటవీ ప్రాంతాల్లోని పరివాహక ప్రాంతాల నుంచి వచ్చేవేనని, సుమారు 160 కోట్ల మంది ప్రజలు ఆహారం, నీరు, మందులు, ఇంధనానికి అడవులపైనే ఆధారపడుతున్నారని, ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మనకు లభించే శుద్ధమైన నీటి వనరులను కాపాడుకోవాలంటే అడవులను కాపాడుకోవడమే ప్రధానమార్గమని దీంతోనే నీటి కొరత ఏర్పడకుండా ఉంటుందని అన్నారు. 2025 నాటికి సుమారు 180 కోట్ల మంది ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎక్కడ ఎలా వర్షం పడినా ఆ నీటిని అటవీప్రాంతాల్లోని వాటర్ షెడ్స్, చిత్తడి నేలల ద్వారా శుభ్రపరచవచ్చని, భూగర్భ జలాలను పెంచడంతోపాటు అనేక రకాలుగా నీటిని క్రమబద్ధీకరించడంలో సైతం అడవులు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంలో నిపుణులు అభిప్రాయాలను వెల్లడించారు.
మరోవైపు నీటి వనరుల రక్షణ, పునరుద్ధరణ కేవలం వాతావరణం వల్ల మాత్రమే కాదని, నీటి శుద్ధి కోసం కొత్త మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరిచి, పచ్చదనాన్ని పెంచడం అవసరమని ఐక్యరాజ్యసమితి అటవీ కార్యదర్శి, ఫోరం డైరెక్టర్ మనోయెల్ సోబ్రల్ ఫిల్తో తెలిపారు. ముఖ్యంగా అడవులు గ్రహాల్లోని సహజ నీటి వనరులు అని ఆయన అన్నారు. ప్రతియేటా మార్చి 21న జరిపే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్ సందర్భంగా నిర్వహించే ఐరాస గణాంకాల్లో... సహజ అడవులు 70 లక్షల హెక్టార్ల వరకూ నశించిపోతున్నట్లు, 5 కోట్ల హెక్టార్లను దహనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.