అమెరికా బాంబులు వేయడానికి మేమే దొరికామా? | Sakshi
Sakshi News home page

అమెరికా బాంబులు వేయడానికి మేమే దొరికామా?

Published Fri, Apr 14 2017 12:58 PM

అమెరికా బాంబులు వేయడానికి మేమే దొరికామా? - Sakshi

అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద బాంబు వేయడానికి కారణం ఉగ్రవాదుల అంతం కాదని, వాళ్ల వద్ద ఉన్న ప్రమాదకరమైన ఆయుధాలను పరీక్షించుకోడానికి వాళ్లు తమ దేశాన్ని ప్రయోగశాలలా వాడుకుంటున్నారని అఫ్ఘాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ మండిపడ్డారు. ’మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’గా చెప్పుకొనే అతిపెద్ద బాంబును అఫ్ఘానిస్థాన్‌ మీద అమెరికా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 36 మంది ఐసిస్‌ ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారు. అయితే, ఇదంతా కేవలం సాకు మాత్రమేనన్నది కర్జాయ్‌ భావనలా కనిపిస్తోంది.

ఈ బాంబు పేలుడు 11 టన్నుల టీఎన్‌టీ పేలుడుకు సమానమని సైనికరంగ నిపుణులు చెబుతున్నారు. పేలుడు వ్యాసార్థం దాదాపు మైలు పొడవుంటుందని కూడా అంటున్నారు. అయితే అసలు ఇది ఉగ్రవాదం మీద యుద్ధం కానే కాదని, ఈ బాంబు దాడిని తాను గట్టిగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇది చాలా అమానవీయమైనదని, తమ దేశాన్ని వాళ్ల కొత్త, ప్రమాదకరమైన ఆయుధాలకు ప్రయోగ కేంద్రంగా ఉపయోగించుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇకనైనా అమెరికాను ఆపాల్సిన బాధ్యత అఫ్ఘాన్‌ ప్రజల మీదే ఉందని ట్వీట్‌ చేశారు.

అయితే అమెరికా మాత్రం ఐసిస్‌ ఉగ్రవాదులను అంతం చేయాలంటే ఈ పెద్ద బాంబు (ఎంఓఏబీ)ని ప్రయోగించడం ఒక్కటే మార్గమని అంటోంది. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న లెక్క తమకు కచ్చితంగా తెలియదని పెంటగాన్‌ చెబుతుంటే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఇది చాలా చాలా విజయవంతమైన ప్రయోగమని అభివర్ణించారు. అచిన్‌ ప్రాంతంలో ఐసిస్‌ ఉగ్రవాదులతో పోరాడుతున్న అఫ్ఘాన్‌, అమెరికన్‌ బలగాలకు ముప్పును వీలైనంత తగ్గించాలనే ఈ దాడి చేసినట్లు అమెరికా సైన్యం చెబుతోంది.

 

Advertisement
 
Advertisement