ఆక్సిజన్‌ కాక్‌టయిల్స్‌కు యమ డిమాండ్‌

Mongolians Drink Oxygen Cocktails To Cope With Smog - Sakshi

ఉలాన్‌బాతర్‌ : మంగోలియా ప్రజలు ఆక్సిజన్‌ కాక్‌టయిల్స్‌ను తెగ పీల్చేస్తున్నారు, లంగ్‌ టీని తెగ తాగేస్తున్నారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న మంగోలియా ప్రజలకు ఇవి మంచి ఉపశమనం ఇస్తున్నాయని ప్రచారం జోరందుకోవడంతో ఈ ఉత్పత్తుల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఓ ఆక్సిజన్‌ కాక్‌టయిల్స్‌ క్యాన్‌ను తీసుకుంటే పచ్చటి అడవిలో నాలుగు గంటలపాటు నడిచినట్లేనన్న ప్రచారం ప్రజల్లో జోరుగా ఉంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక కాలుష్యం ఉన్న ఓ దేశ రాజధాని నగరం ఉలాన్‌బాతర్‌.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన కాలుష్య ప్రమాణాలకన్నా ఉలాన్‌బాతర్‌ నగరంలో కాలుష్యం 133 రెట్లు ఎక్కువగా ఉంది. ఆక్సిజన్‌ కాక్‌టయిల్స్, లంగ్‌ టీలను ఒక డాలర్‌ నుంచి రెండు డాలర్ల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. గర్భవతులైన తల్లులు తప్పనిసరిగా ఆక్సిజన్‌ కాక్‌టయిల్స్‌ను తీసుకోవాలని స్థానిక వైద్యులు ఎక్కువగా సూచిస్తున్నారు. గర్భవతులు కాలుష్యానికి గురైతే 20 శాతం మంది పిల్లలు ఏదో లోపంతో పుడతారని వైద్యులు చెబుతున్నారు. మంగోలియాలో ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా నిమోనియాతో మరణిస్తున్నారు. ‘లైప్‌ ఈజ్‌ ఏర్‌’ నినాదంతో ఆక్సిజన్‌ కాక్‌టయిల్స్‌ను అమ్ముతున్నారు.

లంగ్‌ టీని సేవించడం వల్ల రక్తంలో పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు వస్తాయని, అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లాక శ్లేష్మంగా మారి బయటకు వచ్చేస్తాయని, ఈ టీని సేవించడం వల్ల రోగ నియంత్రణ శక్తి కూడా పెరుగుతుందని ‘లంగ్‌ టీ’ కంపెనీ సీఈవో డాక్టర్‌ బాతర్‌ ఛాంట్సాల్‌డులమ్‌ చెబుతున్నారు. ఈ టీ వల్ల ఊపిరితిత్తులు ప్రక్షాళన అవుతాయని స్థానిక ప్రజలు విశ్వసించడం వల్ల కాలుష్యం ఎక్కువగా ఉండే శీతాకాలంలో వీటి అమ్మకాలు 30 శాతం పెరుగుతున్నాయి. కాలుష్యం ప్రభావం తగ్గించుకోవాలంటే కాలుష్యానికి దూరంగా ఉండడం ఒక్కటే ఉత్తమమార్గమని, ఆక్సిజన్‌ కాక్‌టయిల్స్‌ తీసుకోవడం వల్ల కాలుష్యం ప్రభావం తగ్గుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య విభాగం అధిపతి మరియా నీరా తెలియజేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top