చైనాపై అమెరికన్‌ లాయర్‌ కేసు

Lawsuit Filed Against China In Us For Creation Of Coronavirus - Sakshi

వాషింగ్టన్‌ : కరోనా వైరస్‌ను సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ చైనాపై 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ వాషింగ్టన్‌కు చెందిన న్యాయవాది లారీ క్లేమన్‌ కేసు దాఖలు చేశారు. క్లేమన్‌కు చెందిన ఫ్రీడం వాచ్‌ అండ్‌ బజ్‌ ఫోటోస్‌ అనే సంస్థ టెక్సాస్‌లోని అమెరికా జిల్లా కోర్టులో ఈ కేసు నమోదు చేసింది. జీవరసాయన ఆయుధంగా కరోనా వైరస్‌ను చైనా డిజైన్‌ చేసిందని క్లేమన్‌ ఆరోపించారు. ఈ వైరస్‌ను సృష్టించిన చైనా అమెరికా చట్టంతో పాటు అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలు, నిబంధనలను ఉల్లంఘించిందని అన్నారు.

అమెరికన్లతో పాటు తమ ప్రత్యర్ధి దేశాలకు చెందిన ప్రజలను చంపే ఉద్దేశంతోనే తమ లేబొరేటరీలో ఈ వైరస్‌ను చైనా అభివృద్ధి చేసిందని క్లేమన్‌ ఆరోపించారు. జీవరసాయన ఆయుధంగా ఈ వైరస్‌ను వ్యాప్తి చేసిన చైనా ప్రపంచానికి వాటిల్లిన నష్టానికి గాను 20 లక్షల కోట్ల డాలర్లను పరిహారంగా చెల్లించాలని లా సూట్‌లో క్లేమన్‌ ప్రస్తావించారు. కరోనావైరస్‌ బయటపడిన చైనాలోని వుహాన్‌ ప్రాంతంలో నెలకొన్న వుహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఈ వైరస్‌ను విడుదల చేసిందని ఫిర్యాదిదారు ఆరోపించారు.

అమెరికా ప్రజలే కాకుండా చైనా ప్రత్యర్ధులను టార్గెట్‌ చేస్తూ జీవరసాయన ఆయుధంగా ఈ వైరస్‌ను సిద్ధం చేశారని ఫిర్యాదులో క్లేమన్‌ సంస్థ పేర్కొంది. అమెరికా సేనలు ఈ వైరస్‌ను తమకు అంటగట్టారని చైనా ఆరోపించిన నేపథ్యంలో ఈ మహమ్మారిని సృష్టించిందని చైనానేనని అమెరికా ఆరోపించింది. ఈ వైరస్‌పై హెచ్చరించిన వారిని సైతం చైనా శిక్షించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

భారీ ఊరట : త్వరలోనే మహమ్మారి తగ్గుముఖం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top